CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జగన్ ప్రత్యర్థిగా చూస్తున్నారా? ఆయన ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం ఇష్టం లేదా? చంద్రబాబు మనిషిగా భావిస్తున్నారా? మున్ముందు ఆయనతో తలనొప్పులు తప్పవని అంచనా వేస్తున్నారా? అందుకే ఆయనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ పార్టీ ఎంపీలు కూడా ఇదే మాట చెబుతున్నారు. రేవంత్ కు దూరంగా ఉండాలని సీఎం జగన్ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎంపీల వ్యవహార శైలి ఉంది.
2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపొందారు. పార్టీలు వేరైనా తెలుగు రాష్ట్రానికి చెందిన ఎంపీగా రేవంత్ తో వైసీపీ ఎంపీలకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇంతలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ ఎన్నికయ్యారు. కెసిఆర్ ప్రభుత్వం పై దూకుడుగా వ్యవహరించారు. రాజకీయ మిత్రుడైన కేసీఆర్ కు ప్రత్యర్థి కావడం, చంద్రబాబుకు స్నేహితుడు కావడం, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో రేవంత్ పై వైసీపీకి భిన్నాభిప్రాయం ఉండేది. పైగా తాము కోరుకున్న కెసిఆర్ కాకుండా రేవంత్ సీఎంగా కావడం జగన్ కు ఓకింత షాక్ ఇచ్చినట్టు అయింది. అన్నింటికీ మించి పోలింగ్ రోజున కేసీఆర్ కు లబ్ధి చేకూర్చే విధంగా నాగార్జునసాగర్ పై జగన్ సర్కార్ దండయాత్ర చేసింది. ఇది ముమ్మాటికీ కెసిఆర్ కు మేలు చేసేందుకు జగన్ చేసిన ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పైకి స్నేహ హస్తం అందిస్తున్నా.. రేవంత్ సీఎం కావడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీలో ఎంపీలకు విందు ఇచ్చారు. ఎంపీగా ఉంటూ సీఎం కావడంతో తన సహచర ఎంపీలకు విందు ఇచ్చారు. ఈ విందుకు ఏపీకి చెందిన అన్ని పార్టీల ఎంపీలకు ఆహ్వానం పంపారు. అయితే ఈ విందుకు హాజరైన వైసీపీ ఎంపీలకు జగన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇది ఎందుకు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, తిరుపతి, రాజంపేట, బాపట్ల ఎంపీలు డాక్టర్ గురుమూర్తి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, నందిగామ సురేష్ లు వెళ్లలేదు. మిగతా ఎంపీలు దాదాపు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే విందుకు హాజరైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సీఎం జగన్ క్లాస్ పీకినట్లు సమాచారం. రేవంత్ విందుకు వెళ్లిన వారి వివరాలను ఇంటలిజెన్స్ అధికారులు సీఎం జగన్ నివేదిక సమర్పించారు. దీంతో వారిని పిలిచి మందలించినట్లు తెలుస్తోంది. అసలు ఎందుకు వెళ్ళకూడదో జగన్ చెప్పలేదని.. సహచర ఎంపీ ఇచ్చిన విందుకు కూడా హాజరు కావడానికి సీఎం అనుమతి తీసుకోవాలా అంటూ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.