Purandeshwari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైసీపీ నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారు. కానీ ఆమెకు అండగా రాష్ట్ర బిజెపి నాయకులు ఎవరూ నోరు మెదపకపోవడం విశేషం. దీంతో ఆమె బిజెపిలో ఏకాకి అయ్యారా? అన్న టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురందేశ్వరి నియామకం అనూహ్యం. ఎవరు ఊహించలేదు కూడా. కానీ ఏరి కోరి హై కమాండ్ ఆమెను ఎంపిక చేసింది. దీంతో బిజెపి శ్రేణులను ఆమె సమన్వయపరుస్తారని టాక్ నడిచింది. కానీ అందుకు విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితి ఉంది.
వాస్తవానికి ఆమె నియామకంతో.. టిడిపి పైన ఎక్కువ ప్రభావం చూపుతుందని అంతా అంచనా వేశారు. చంద్రబాబుతో ఉన్న వైరం అందుకు కారణం. అయితే ఆమె తెలుగుదేశం పార్టీతోనే సన్నిహితంగా మెలుగుతున్నారు. వైసీపీని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులు పురందేశ్వరి పై గురి పెట్టారు. కింది స్థాయి నేతల నుంచి మంత్రుల వరకు.. విజయ్ సాయి రెడ్డి లాంటి నేతలు తరచూ విమర్శలకు దిగుతున్నారు. కానీ ఆ స్థాయిలో బిజెపి నుంచి ప్రతిఘటన ఎదురు కావడం లేదు. ఇదే చర్చనీయాంశంగా మారుతోంది.
అయితే పురందేశ్వరి వ్యవహార శైలి కారణంగానే రాష్ట్ర బిజెపి నాయకులు మౌనం దాల్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ స్మారకార్థం వంద రూపాయలు నాణేన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి తన సామాజిక వర్గానికి చెందిన బిజెపి నాయకులనే ఆమె తీసుకెళ్లారు. పైగా చంద్రబాబుతో వేదిక పంచుకోవడానికి సిద్ధపడ్డారు. పార్టీలో పదవుల పంపకంలో సైతం తన సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యమిచ్చారని టాక్ నడుస్తోంది. అదే సమయంలో టిడిపి ప్రయోజనాల కోసం ఆమె పనిచేస్తున్నారు అన్న విమర్శ వెంటాడుతోంది.
ఆ మధ్యన పురందేశ్వరి ఏపీ ప్రభుత్వ అప్పులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. కానీ ఆ మరుసటి రోజే నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అప్పట్లో పురందేశ్వరి నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసిపి సర్కార్ పై పురందేశ్వరి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వైసిపి నేతలు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. కానీ ఏ ఒక్క బీజేపీ నేత ఆమెకు అండగా నిలవని దుస్థితి. కనీసం ఆమె సామాజిక వర్గానికి చెందిన వారు సైతం గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. అటు జాతీయ నాయకులు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో పురందేశ్వరి పార్టీలో ఒంటరి అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో సోము వీర్రాజు ఉండేటప్పుడు.. నాయకత్వం పరంగా ఆయనతో విభేదించిన వారు సైతం.. ప్రత్యర్థులు విమర్శించినప్పుడు స్పందించేవారు. ఇప్పుడు పురందేశ్వరి విషయంలో ఆ పరిస్థితి లేదు. ఏపీ కాషాయ దళంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.