Jagan and Jogi Ramesh: జోగి రమేష్( Jogi Ramesh) అరెస్టయ్యారు. రెండు వారాల కిందట ఆయన నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లారు. ప్రారంభంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సానుభూతి చూపించారు. తరచూ మూలాఖత్ లో కలిసేవారు. అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శిస్తారని.. కుటుంబానికి భరోసా ఇస్తారని అంతా భావించారు. అరెస్టు సమయంలో ఒక ట్వీట్.. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పొడిపొడిగా వ్యాఖ్యలు తప్పించి జోగి రమేష్ విషయంలో జగన్మోహన్ రెడ్డి స్పందించిన దాఖలాలు లేవు. అయితే చివరిలో కల్తీ మద్యం విషయంలో జోగి రమేష్ అతిగా చేశారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం నడిచింది. విజయవాడ దుర్గమ్మ గుడికి కుటుంబంతో సహా వెళ్లి ప్రమాణం చేయడానికి సిద్ధపడ్డారు జోగి రమేష్. కల్తీ మద్యం పై ఒక రకమైన పోరాటం చేస్తుంటే జోగి రమేష్ అడ్డదిడ్డంగా ప్రమాణాలకు వెళ్లడం ఏంటనేది వైసీపీ నుంచి వినిపించిన మాట. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జోగి రమేష్ విషయంలో సహాయ నిరాకరణ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.
వ్యవహార శైలిలో మార్పు..
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జోగి రమేష్ వ్యవహార శైలి చాలా రకాల చర్చకు దారి తీసింది. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో జగన్ మెప్పు పొందేందుకు ఆయన ప్రత్యర్థులను తిట్టారు. ఏకంగా చంద్రబాబు నివాసం పై దండయాత్ర చేశారు. ఒక్క విధంగా చెప్పాలంటే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడాలంటే జోగి రమేష్ ను ప్రయోగించేవారు. ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చి ప్రత్యర్థులపై వాడుకునేవారు. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యర్థులపై చేసిన వ్యాఖ్యలే జోగి రమేష్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై ఫోకస్ పెరగడంతో జోగి రమేష్ సైతం వెనక్కి తగ్గారు. అలా ఆయన తగ్గడంతో జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం వచ్చింది. ఎందుకంటే జోగి రమేష్ తాను ఎప్పుడు ప్రయోగిస్తే అప్పుడు మాట్లాడాలి. అయితే అధికారంలో లేకపోతే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో జోగి రమేష్ కు తెలుసు. అందుకే ఆయన పెద్దగా మాట్లాడలేదు. అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనుమానాలకు కారణం అయ్యింది.
శాసనసభ ఘటనపై..
జోగి రమేష్ వ్యవహార శైలి తెలుసు. రాజకీయంగా ఆయన ఎదిగిన తీరు కూడా రాజకీయ పార్టీలకు తెలుసు. అందితే జుట్టు.. లేకుంటే కాలు అన్నట్టు ఉంటుంది జోగి రమేష్ పరిస్థితి. కూటమి వచ్చిన తర్వాత తన అరెస్టు తప్పదని భావించిన క్రమంలో.. ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. వైసిపి హయాంలో శాసనసభలో చంద్రబాబు భార్యకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్నారు. ముమ్మాటికి తప్పిదం అని తేల్చి చెప్పారు. తన భార్య కూడా ఆరోజు తనను నిలదీసినంత పని చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఇదే మాట అధికారంలో ఉండేటప్పుడు జోగి రమేష్ చెబితే ఎవరైనా నమ్మేది. కానీ కేసుల భయంతోనే జోగి రమేష్ ఆ వ్యాఖ్యలు చేశారు. అవి అంత మాత్రం జగన్మోహన్ రెడ్డికి రుచించలేదని తెలుస్తోంది.
పార్టీ మారుతారని ప్రచారం..
జోగి రమేష్ పార్టీ మారుతారని కూడా ప్రచారం సాగింది. కొద్ది రోజులపాటు ఆయన తాడేపల్లి ( Tadepalli )ప్యాలస్ వైపు కూడా రాలేదు. కూటమి పార్టీలతో సర్దుబాటు చేసుకుంటున్నారని సమాచారం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ మంత్రితో పాటు ప్రజాప్రతినిధులతో వేదిక పంచుకొని పార్టీ మారేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అయితే టిడిపి క్యాడర్ నుంచి అభ్యంతరాలు రావడంతో వెనక్కి తగ్గారు. అయితే తనపై జగన్మోహన్ రెడ్డికి అనుమానం రావడంతో కల్తీ మద్యం వ్యవహారాన్ని నడిపించారు. తద్వారా ఈ కల్తీ మద్యం తోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయని అనుమానం రావాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ కల్తీ మద్యం నిందితుడి వాంగ్మూలంటూ కథ అడ్డం తిరిగింది. అయితే మొత్తం జోగి రమేష్ వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇబ్బందికరంగా మారింది. వదిలించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జైలుకు వెళ్లిన జోగి రమేష్ కు సహాయ నిరాకరణ అని ప్రచారం నడుస్తోంది.