Jagan Latest News: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పరిస్థితి. భారీ ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వమే కారణమవుతోందని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తానని చెప్పుకొస్తున్నారు. త్వరలో రోడ్డు ఎక్కుతానని కూడా గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. పులివెందుల పర్యటనకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అరటి రైతులను పరామర్శించారు. అరటి సాగు గిట్టుబాటు కావడంలేదని.. పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఉందని జగన్ ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే భారీ ప్రకటనలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ మాదిరిగానే అరటి రైతుల విషయంలో కూడా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. వైసిపి హయాంలో బాగుండేదని తనకు తాను మెచ్చుకునేలా మాట్లాడారు.
ధరల స్థిరీకరణ లేదు..
రాష్ట్రంలో ధరల స్థిరీకరణ లేదన్నది ఒక వాస్తవం. అయితే ఇది ఒక కూటమి ప్రభుత్వంలోనే కాదు. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో ఇంతకు మిక్కిలి ఉండేది. రాయలసీమలో పంట రోడ్డుపై పారేస్తుంటే.. ఉత్తరాంధ్రలో దాని ధర ఆకాశానికి ఉండేది. ఒక్కటి మాత్రం నిజం రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ.. ఈ పంటలను వేరువేరు ప్రాంతాల్లో విక్రయించగలిగితే రైతులకు ఎంతో ప్రయోజనం. చిత్తూరు జిల్లాలో టమాట పంట ధర పతనం అయిన సమయంలో.. ఉత్తరాంధ్రలో దాని కిలో ధర 30 రూపాయల కు పైగా ఉంటుంది. అదేంటి అక్కడ పారబోస్తున్నారు ఇక్కడ అంత ధర అని అడిగితే.. మార్కెటింగ్ తో పాటు రవాణా భారం అంటూ చెబుతుంటారు వ్యాపారులు. ఇటువంటి సమయంలోనే మార్క్ఫెడ్ తన ప్రభావం చాటుకోవాలి. రైతులకు ప్రయోజన కారిగా మారాలి.
Also Read: కల్తీ మద్యం ఇప్పటిది కాదు.. జోగి రమేష్ చుట్టూ ఉచ్చు!
ఫీజుల పెండింగ్ ఆయన పాపమే..
అయితే జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇప్పుడు ఈ పంటలు.. ఫీజు రియంబర్స్మెంట్( fee reimbursement ) గురించి మాట్లాడుతుండడం మాత్రం వింతగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది ఆయన. సంక్షేమ పథకాల విషయంలో ఆయనను తప్పు పట్టలేం. కానీ ఆయన హయాంలో రాజ్యాంగబద్ధ చెల్లింపులు,. పంటలకు మద్దతు ధర, వ్యవస్థల నిర్వీర్యం గురించి చెప్పనవసరం లేదు. సంక్షేమ పథకాల గురించి ఆయన డప్పు కొట్టుకున్న అభ్యంతరం లేదు. కానీ వ్యవస్థీకృతమైన వైఫల్యాలు, దానికి కొనసాగుతున్న అంశాలు ముమ్మాటికి జగన్ పాపమే. జగన్మోహన్ రెడ్డి హయాంలో అరటికి ధర వచ్చిందన్నది ఆయన మాట. అటువంటప్పుడు పులివెందులలో నేతలతో చందాలు వేసుకుని వారికి అప్పట్లో ఆర్థిక ప్రయోజనం కల్పించలేదా? అప్పుడే వ్యవస్థలపరంగా, శాఖల పరంగా అరటి రైతులకు న్యాయం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాదు. ఇది ముమ్మాటికీ సత్యం. కానీ తన తప్పిదాలను మరచిపోయి ఇప్పుడు మరొకరిపై నెట్టు వేసేందుకు ప్రయత్నించడం మాత్రం ముమ్మాటికి తప్పిదమే.