Chandrababu: తెలుగు మీడియా అడ్డగోలుగా చీలిపోయింది. పార్టీల వారీగా మారిపోయింది.టిడిపి అంటేనే ఈనాడు,ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ.. వైసిపి అంటే సాక్షి, టీవీ9, ఎన్టీవీ అన్నట్టు పరిస్థితి మారింది. టిడిపి అనుకూల మీడియాను ఎల్లో మీడియా గా.. వైసిపి అనుకూల మీడియాను నీలి మీడియాగా అభివర్ణిస్తున్నారు. తటస్థ మీడియాను అయితే అవసరాలకు తగ్గట్టుగా మారే కూలి మీడియాగా పిలుస్తున్నారు. అయితే ఆ మీడియాల సంస్కృతి కూడా అలానే ఉంది. అయితే ఈ పరిస్థితికి రావడానికి ముమ్మాటికీ కారణం రాజకీయ పార్టీలే. అయితే కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలను బ్యాన్ జాబితాలో చేర్చడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
గతంలో మీడియాకు అత్యంత సన్నిహితుడు చంద్రబాబు. మీడియా సైతం ఆయనను ఎంతో గౌరవించేది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబును విజినరీ నాయకుడిగా గుర్తింపు పొందడంలో మీడియా పాత్ర ఉంది. అటువంటి చంద్రబాబు ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలను నిషేధ జాజితాలో జత చేయడం ఆందోళన కలిగిస్తుంది. సాక్షి అనేది జగన్ సొంత మీడియా. కరపత్రం లాంటిది. అటువంటి మీడియాను బహిష్కరించడం సహేతుకమే అయినా.. టీవీ9, ఎన్టీవీలను బహిష్కరించడం మాత్రం కొంచెం అతి అవుతోంది. ఎందుకంటే అవి కొంతవరకు తటస్థంగా వెళుతున్నాయి. కానీ ఆ టీవీ ఛానల్ డిబేట్లకు టిడిపి నేతలు హాజరు కాకూడదని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. అటు వైసీపీ సైతం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ డిబేట్లకు నేతలు వెళ్ళవద్దు అని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది.
ప్రస్తుతం ఎన్టీవీ తో పాటు టీవీ9 కు ప్రేక్షకాదరణ అధికంగా ఉంది. ఆ చానల్లో జగన్కు అత్యంత ప్రాధాన్యం దక్కుతోంది. కానీ చంద్రబాబు, పవన్లకు ప్రాధాన్యం అంతంత మాత్రమే. అయితే ఈ విషయంలో చంద్రబాబు స్వయంకృతాపం ఉంది. వివిధ యాడ్లు, వ్యాపార ప్రకటనల విషయంలో ఆ మీడియా ఛానళ్లు అధికార పార్టీకి కొంత అనుకూలంగా పని చేయవచ్చు కానీ.. వాటిని బ్యాన్ చేయడం ద్వారా చంద్రబాబు ఆ ఛానల్ లలో కనిపించకుండా పోయారు. వాస్తవానికి టిడిపి శ్రేణులు ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ 5, మహా టీవీ చానళ్లను మాత్రమే చూస్తాయి. అటు వైసిపి వారు సాక్షితో పాటు టీవీ9,ఎన్టీవీ లను ఎక్కువగా చూస్తారు. అయితే తటస్తులు సైతం ఎన్టీవీ, టీవీ9 ఛానళ్ల ను విశ్వసిస్తారు. కనీసం అటువంటి వారి కోసమైనా చంద్రబాబు ఆ రెండు చానళ్ల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ పరంగా బ్యాన్ చేయడంతో పాటు డిబేట్లకు హాజరు కాకూడదని టిడిపి నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తుంది. చంద్రబాబు మీడియా పరంగా ఉన్న మంచి పేరును పోగొడుతోంది.