Homeఆంధ్రప్రదేశ్‌TTD Tirumala Laddu Controversy : సుప్రీం ప్రశ్నల నేపథ్యంలో తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు,...

TTD Tirumala Laddu Controversy : సుప్రీం ప్రశ్నల నేపథ్యంలో తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్ రాజకీయం కరెక్టేనా?

TTD Tirumala Laddu Controversy : తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఈరోజు కీలకంగా మారింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈరోజుకు కేసును వాయిదా వేసింది. దీంతో కోర్టు మరోసారి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందోనని అంతటా టెన్షన్ కనిపిస్తోంది. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసిపి వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో.. తిరుపతి లడ్డులో జంతు కొవ్వు కలిపారని ఆరోపించారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయ్యింది. జాతీయస్థాయిలో దీనిపై చర్చ నడిచింది. ఆందోళనలు సైతం కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు దెబ్బతీసేలా ఈ వివాదం నడిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అత్యున్నత దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే దీనిపై వైసీపీ కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది.ముందుగా జగన్ స్పందించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. ప్రభుత్వ పాలన వైఫల్యా ల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. మరోవైపు టీటీడీ చైర్మన్లు గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సైతం స్పందించారు. జరిగిన ఘటనను ఖండించారు. చంద్రబాబు కుట్రగా చెప్పుకొచ్చారు. కరుణాకర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తిరుపతిలో ఏకంగా తనకు తానుగా దీపం వెలిగించి ప్రమాణం చేశారు. తన హయాంలో ఎటువంటి తప్పిదం జరగలేదని చెప్పుకొచ్చారు.

* వైసీపీలో అలజడి
అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో వైసిపి కార్నర్ అయింది. హిందూ వ్యతిరేకముద్ర ఉన్న వైసిపి పై ఈ ఆరోపణలు రావడంతో ఆ పార్టీలో సైతం ఒక రకమైన అలజడి నెలకొంది. అందుకే జగన్ ఈ విషయంలో అలర్ట్ అయ్యారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి తో పిటిషన్ వేయించారు. నిజాలు నిగ్గు తేల్చాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ఆపిటిషన్లో కోరారు. అదే సమయంలో బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సైతం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారించింది కూడా.

* కోర్టు ప్రశ్నలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి
కేసు విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం వేసిన ప్రశ్నలతో టిడిపి కూటమి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయింది. అప్పటివరకు వైసీపీని కార్నర్ చేసిన టిడిపి కూటమి.. సుప్రీం కోర్టు నుంచి ఎదురైన ప్రశ్నలతో డిఫెన్స్ లో పడింది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం చంద్రబాబు సభలో మాట్లాడడం ఏంటి? ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఏంటి? ఒక్క ల్యాబ్ లో నిర్ధారిస్తే సరిపోతుందా? సెకండ్ ఒపీనియన్ పోల్ ఎందుకు తీసుకోలేదు? శాంపిల్ నిర్ధారణ పరీక్షల తేదీల్లో గందరగోళం ఉంది అంటూ వ్యాఖ్యానించింది. అదే సమయంలో సిట్ దర్యాప్తుపై మాట్లాడింది. ముందుగానే ఆరోపణలు చేసి నిర్ధారించిన సీఎం చంద్రబాబు వేసిన సిట్ దర్యాప్తునకు ప్రామాణికం ఉంటుందా? అని ప్రశ్నించింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని కోరుతూ సోలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. కేసును ఈరోజుకు వాయిదా వేసింది.

* ఆగిన సిట్ విచారణ
అయితే అత్యున్నత న్యాయస్థానం ఈ ప్రశ్నలు సంధించేసరికి కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. వెంటనే సిట్ విచారణ సైతం ఆగింది. అయితే ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ అతిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా లడ్డు వివాదం వచ్చిందో లేదో దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ అవసరమని పవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తరువాత ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. విజయవాడ దుర్గమ్మ మెట్ల మార్గాన్ని శుభ్రం చేశారు. అనంతరం తిరుపతి వెళ్లి దీక్ష విరమించారు. అయితే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రశ్నలు వేసిందో అప్పటినుంచి టిడిపి కూటమి ప్రభుత్వంపై కూడా విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇది రాజకీయ లో భాగంగా చేసిన ఆరోపణ అన్నవారు అధికమవుతున్నారు. మొత్తానికైతే తిరుపతి లడ్డు వివాదంపై ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అన్నది ప్రధాన అంశంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular