Chandrababu: చంద్రబాబు గట్టి ప్రయత్నాలు తరువాతే బిజెపి పొత్తుకు ఒప్పుకుంది.బిజెపి కోసం చంద్రబాబుతో పాటు పవన్ సైతం చివరి వరకు వెయిట్ చేశారు. ఎలాగోలా బిజెపిని ఒప్పించి తమ దారికి తెచ్చుకున్నారు. అయితే గత ఎన్నికలకు ముందు.. తర్వాత జరిగిన పరిణామాలతో టిడిపి, బిజెపి శ్రేణుల మధ్య గ్యాప్ అమాంతం పెరిగింది. బిజెపికి వ్యతిరేకంగా టిడిపి, టిడిపికి వ్యతిరేకంగా బిజెపి వ్యవహరిస్తూ వచ్చాయి. టిడిపి నాయకత్వం మాత్రమే బిజెపి అవసరాలను ఆలోచించుకొని సంధికి ప్రయత్నించింది. కానీ టిడిపి శ్రేణులు మాత్రం బిజెపి వైఖరిని తప్పుపట్టేవి. అయితే ఇప్పుడు పొత్తుల తర్వాత ఆ ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది.
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు బిజెపిని విభేదించడాన్ని.. వైసిపి తనకు అనుకూలంగా మార్చుకుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు.. బిజెపితో వైసిపి అలా వ్యవహరించడం ప్రారంభించింది. ఎక్కడా ఎన్డీఏలో చేరకుండా… భాగస్వామ్య పక్షానికి మించి కేంద్ర ప్రభుత్వ సాయాన్ని జగన్ అందుకోగలిగారు. సహజంగానే ఇది టిడిపికి మింగుడు పడని విషయం. అందుకే జగన్ చేసిన ప్రతి పని వెనుక కేంద్ర పెద్దల సాయం ఉందన్నది అనుమానం. చివరకు చంద్రబాబును జైల్లో పెట్టించిన సమయంలో కూడా టిడిపి శ్రేణులు జగన్ కంటే మించి బిజెపి పెద్దలపైనే అనుమానం వ్యక్తం చేశారు. వారే దీనికి కారణమని ఆరోపణలు చేశారు. దీంతో బిజెపి అంటేనే ఒక ఏహ్య భావంతో టిడిపి శ్రేణులు ఉండేవి. అయితే గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందో చంద్రబాబుకు తెలుసు. అందుకే ఎన్డీఏకు దగ్గర కావాలని ప్రయత్నాలు చేశారు. దగ్గర కాగలిగారు. కానీ వైసీపీ ఈ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో.. అన్ని రకాలుగా చేస్తోంది.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండకుండా బిజెపిలోని ప్రోవైసిపీ నేతలు ఎంతగానో ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. అటు చంద్రబాబు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బిజెపిలోని ప్రో టిడిపి నేతలకు ప్రాధాన్యం దక్కేలా.. వారికి సీట్లు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన చోట్ల టిడిపి ఆశావహులు ఒక రకమైన ఇబ్బందులు పెడుతున్నారు. వాటిని అధిగమించేందుకు తన ప్రజా గళం వాయిదా వేసుకుని మరి వివాదాస్పద నియోజకవర్గాల్లో విభేదాలను సమస్య పోయేలా చేయాలని చూస్తున్నారు. మరోవైపు పొత్తులపై వైసిపి దుష్ప్రచారం ప్రారంభించింది. గతం నుంచి టిడిపి, బిజెపిల మధ్య ఉన్న గ్యాప్ ను మరింత పెంచి.. విభేదాల దిశగా తీసుకెళ్లాలని ఆలోచించింది. బిజెపితో టిడిపి పొత్తు తాత్కాలికమేనని.. పొత్తు పెటాకులు కావడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది. దీంతో చంద్రబాబు సైతం అలర్ట్ అయ్యారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము ఎన్డీఏలో చేరామని.. ఇక్కడ నుంచి ఎన్డీఏలో కొనసాగుతామని స్పష్టం చేశారు. పొత్తుతో వైసిపి భయపడుతోందని.. అందుకే ఈ తరహా గోబెల్స్ ప్రచారానికి దిగిందని ఆరోపించారు. అటు బిజెపి శ్రేణులకు సైతం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి అయితే బిజెపితో పొత్తు వ్యవహారంలో చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.