Mani Annapureddy: ఏపీ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. రాజకీయ ముసుగులో కొన్ని కేసుల్లో నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు వారు బయటకు వస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనాపరమైన అంశాలకు సంబంధించి కోర్టుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఒకానొక దశలో శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం ఏమిటని వైసీపీలోని కీలక ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు సైతం కోర్టుల జోక్యాన్ని తప్పుపట్టారు. ఆ సమయంలో వైసీపీ సానుభూతిపరులు రెచ్చిపోయారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని రంకెలు వేశారు. అయితే వారిలో కొందరిని అరెస్టు చేశారు. మరికొందరు తప్పించుకుని తిరుగుతున్నారు. అందులో ఒకరు మణి అన్నపురెడ్డి. ప్రస్తుతం సీఎం ఎన్నికల ప్రచారంలో అన్నపురెడ్డి మారువేషంలో ప్రత్యక్షం అయినట్లు ప్రచారం జరుగుతోంది.
మణి అన్నపురెడ్డి అమెరికాలో ఉండేవారు. వైసిపి పాలనకు ఇబ్బంది పెడుతున్న న్యాయమూర్తులు అంటూ అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉండే అన్నపురెడ్డిని పట్టుకునేందుకు ఇంటర్ పోల్ సాయం తీసుకుంటామని అప్పట్లో సిపిఐ కోర్టుకు స్పష్టం చేసింది. కానీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఆ అంశమే మరుగున పడింది. ఇప్పుడు అదే మణి అన్నపురెడ్డి ఇండియాలో ప్రత్యక్షమయ్యారు. సీఎం జగన్ ప్రచార సభల్లో కనిపిస్తున్నారు. అయితే ఆయన పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. వేషం, ఆహార్యం, హావ భావాలు మార్చుకున్నారు. శివ అన్నపురెడ్డి గా పిలవబడుతున్నారు. బోడి గుండు చేయించుకుని, మీసాలను విచిత్రంగా పెంచుకొని.. ఎవరు గుర్తుపట్టకుండా తిరుగుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన గురించి మీడియాకు ఎవరో సమాచారం అందించారు. ఆయన సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అందించారు. దీంతో గుట్టు కాస్త రట్టు అయింది.
కేవలం న్యాయమూర్తి పై అనుచిత వ్యాఖ్యలే కాదు. ఇప్పుడు కొత్తగా నకిలీ పాస్పోర్ట్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మణి అన్నపురెడ్డి అనే పేరు ఎలా మార్చుకున్నారు? పాస్పోర్ట్ కూడా ఎలా మేనేజ్ చేశారు? తన పేరును ఈజీగా మార్చేసుకుని ఇంటర్ పోల్ పోలీసుల కన్ను గప్పారా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. చిన్న లుక్ అవుట్ నోటీసు జారీ చేస్తేనే.. ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేస్తారు. మరి ఈ శివ అలియాస్ మణి అన్నపురెడ్డి ఎలా తప్పించుకున్నారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయన అరెస్టు ఖాయంగా తేలుతోంది. అయితే సీఎం జగన్ ప్రచార సభల్లో ఆయన కనిపిస్తుండడంతో.. అరెస్టు చేసే సాహసం చేస్తారా? అనే సందేహం కలుగుతోంది.