International Law University: అమరావతిలో( Amravati capital ) మరో అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు కానుంది. ఉన్నత విద్యారంగంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. అంతర్జాతీయ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అనుమతులు లభించాయి. దీంతోపాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపనకు సులభతరం చేసే సవరణ బిల్లులకు, మరికొన్ని మార్పులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఇటీవల శాసనసభ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులను రాష్ట్ర విద్య, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ శాసనమండలిలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదముద్ర వేసింది.
ఉన్నత విద్యాపరంగా మేలు..
చట్టాల సవరణతో ఆంధ్రప్రదేశ్ కు విద్యాపరంగా మరింత మేలు జరగనుంది. రాష్ట్రంలో న్యాయ విద్య, పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్’ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును మంత్రి లోకేష్ సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా నారా లోకేష్ శాసనమండలిలో ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్టాత్మక సంస్థను రాష్ట్రానికి సాధించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం కోసం కూటమి ప్రభుత్వం అమరావతిలో 55 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కాగా ఇందులో ఏపీ విద్యార్థులకు 25 శాతం సీట్లు కూడా రిజర్వ్ చేసింది. ఇదే విషయాన్ని నారా లోకేష్ ధ్రువీకరించారు. యూనివర్సిటీతో పాటు ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఒకవైపు అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదే విషయాన్ని సభాముఖంగా ప్రకటించారు నరా లోకేష్.
గతంలో ఎన్నో అడ్డంకులు..
వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టాన్ని రూపొందించారు. అయితే దానికి కొన్ని సవరణలు అడ్డంకిగా మారాయి. టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీ ఉండాలనే నిబంధన యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది. దీంతో కొత్త యూనివర్సిటీల ఏర్పాటు కష్టతరంగా మారింది. అందుకే ఈ మూడు రకాల సవరణ బిల్లులు శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. దీంతో అమరావతిలో అంతర్జాతీయ లా యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
ప్రపంచ న్యాయవిద్య బోధన..
అంతర్జాతీయ లా యూనివర్సిటీలో.. ప్రపంచవ్యాప్తంగా ఉండే న్యాయవిద్యను బోధించనున్నారు. కేవలం భారతీయ చట్టాల గురించే కాకుండా.. ప్రపంచ దేశాల్లో అమల్లో ఉన్న చట్టాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. అక్కడ ఉండే సెక్షన్లు, శిక్సాస్మృతులు వంటి వాటిపై బోధన చేయనున్నారు. అంతర్జాతీయ న్యాయ చట్టాలను వివరించనున్నారు. ఇప్పటివరకు ఇటువంటి లా యూనివర్సిటీలు, అనుబంధ సంస్థలు పెద్ద నగరాలకి పరిమితం అయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అమరావతిలో ఏర్పాటు కానుండడం నిజంగా గొప్ప పరిణామం. అంతర్జాతీయ విద్యకు.. ఏపీ విద్యను అనుసంధానించే ప్రక్రియలో భాగంగా లోకేష్ చేస్తున్న కృషి అభినందనలు అందుకుంటుంది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపడతామని మంత్రి నారా లోకేష్ చెప్పడం విశేషం.
ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు యూనివర్సిటీల స్థాపనకు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ యూనివర్సిటీలతో పోల్చుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ కేజీ టు పీజీ విద్య అందుతోంది. అయితే యుజిసి నిబంధనల ప్రకారం.. ఏపీ ప్రభుత్వం రూపొందించిన యూనివర్సిటీల చట్టం ప్రకారం.. కొత్త వాటి ఏర్పాటుకు అనేక రకాల అవాంతరాలు ఉన్నాయి. అందుకే ఆ చట్టాలను సవరిస్తూ కూటమి ప్రభుత్వం బిల్లులను చట్టసభల్లో ఆమోదం పొందింది. దీంతో ఏపీలో ఉన్నత విద్యారంగంలో సరికొత్త అధ్యయనం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. విద్యావేత్తల నుంచి అభినందనలు అందుకుంటోంది.