Ramoji Rao Passed Away: ఏమైనా అనుకోండి.. రామోజీ ఒక అనన్య సామాన్యుడు

ఈనాడు నుంచి రామోజీ ఫిలిం సిటీ దాకా.. రామోజీరావు స్థాపించిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఉద్యోగులకు అతడు జీవితాన్ని ఇచ్చాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 8, 2024 12:23 pm

Ramoji Rao Passed Away

Follow us on

Ramoji Rao Passed Away: నలుగురు నడిచిన బాటలో నడిస్తే మన గొప్పేం ఉంటుంది. సవాళ్లను ఎదుర్కోవాలి. కష్టాలను స్వీకరించాలి. కన్నీళ్లను దిగమింగుకోవాలి.. ఏటికి ఎదురీదాలి. అప్పుడే మనం ఏంటో నలుగురికి తెలుస్తుంది. నలుగురు నోళ్ళల్లో నానేలా చేస్తుంది. రామోజీ వ్యక్తిత్వాన్ని.. చాంతాడంత ఉపోద్ఘాతం లేకుండా చెప్పాలంటే.. ఇలా చెప్పొచ్చు.. కానీ అతని జీవితంలో తెలిసిన విషయాలను కూడా సోదాహరణంగా చెప్పకపోతే ఎలా?

మొహమాటం ఉండదు

ఈనాడు నుంచి రామోజీ ఫిలిం సిటీ దాకా.. రామోజీరావు స్థాపించిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఉద్యోగులకు అతడు జీవితాన్ని ఇచ్చాడు. ఇవాల్టికి తెలుగు నాట పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్న వారంతా తన ఈనాడులో పనిచేసిన వారే. అలాంటి రామోజీరావు ముక్కుసూటిగా ఉంటాడు. చెప్పింది వింటాడు. అంతిమంగా పది సంవత్సరాలు తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడే ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటాడు. అది కొంతమందికి నచ్చొచ్చు.. నచ్చకపోవచ్చు. కానీ, ఆయన ప్రాక్టికల్ ధోరణి అలానే ఉంటుంది.. ఆయన వ్యక్తిత్వానికి మరో వ్యక్తితో పోలిక ఉండదు. ఆయన పనితీరుకు కొలబద్ధ ఉండదు. ఆయన ఆశయానికి అవధి ఉండదు. నూటికో, కోటికో రామోజీరావు లాంటివారు ఉంటారు. నేనంటే నేనే.. నాలా నేనే అని సగర్వంగా చెప్పగల.. ప్రపంచంతో వెయ్యినోళ్ల కొనియాడగల సమర్ధుడు రామోజీరావు. అతడు మార్గదర్శి.. ఈనాడు ప్రచురణకర్త.. ప్రియా పచ్చళ్ళ సృష్టికర్త.. ఇంకా చెప్పాలంటే చాలా సంస్థల ఆవిష్కర్త.. 88 సంవత్సరాల శకకర్త.

ఇంటిపేరు ఈనాడుగా

రామోజీరావు ఇంటిపేరు చెరుకూరి. ఈనాడు పత్రికను స్థాపించడంతో అది ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. తెలుగు మీడియా రంగంలో రామోజీరావు తీసుకొచ్చిన మార్పులు, సమాచార విప్లవం, సామాన్యులకు చేరువ చేసిన తీరు అనన్య సామాన్యం. స్థానిక వార్తలకు ప్రాధాన్యాన్ని ఇచ్చి.. చుక్కల్లో ఉన్న వార్తాపత్రికను నేలకు దించిన ధీరత్వం రామోజీరావు సొంతం. ఇవాల్టికి తెలుగు మీడియా రంగం ఐదు దశాబ్దాల క్రితం ఆయన వేసిన బాటలోనే నడుస్తోంది. ఇక ముందు కూడా నడుస్తూనే ఉంటుంది.

అపజయాలు ఎందుకూ లేవు..

రామోజీరావు పట్టిందల్లా బంగారమే అయ్యింది. చేసిన పనిలో విజయమే లభించింది. అలా అని ఆయన జీవితంలో వైఫల్యాలు లేవా అంటే ఉన్నాయి. రామోజీరావు తొలినాళ్లల్లో ప్రారంభించిన ఫెర్టిలైజర్ వ్యాపారం నష్టాలను మిగిల్చింది. సోమా డ్రింక్స్ కష్టాలను పరిచయం చేసింది. న్యూస్ టైం అపజయాన్ని కళ్ళ ముందు ఉంచింది. చివరికి చిన్న కుమారుడు సుమన్ తో విభేదం ఎదురయింది. చివరికి ఆయనను కూడా పక్కన పెట్టడానికి రామోజీరావు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఉపయోగం లేని వాటిని నిరంతరం భరించేంత సామర్థ్యం తనకు లేదని మొహమాటం లేకుండానే చెప్పేవారు. చేతల్లో చేసి చూపించేవారు. నిలువెత్తు ప్రాక్టికల్ వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఉండేవారు రామోజీరావు. అలాంటి పాఠాలు.. అలాంటి సూత్రాలు బహుశా ఐఐఎం లో కూడా చెప్పరు కావచ్చు.

వెన్ను చూపలేదు

ఈనాడు పత్రిక ప్రారంభించిన తొలినాళ్లల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి కష్టాలను భరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆర్థిక మూలాలను పెకిలిస్తుంటే సహించారు. జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేస్తుంటే తట్టుకోని నిలబడ్డారు. ఇన్ని ప్రతిబంధకాల మధ్య తనను తాను ప్రతిసారి పునరావిష్కరించుకున్నారు. అంతటి వయసులోనూ వెన్ను చూపించలేదు. చివరికి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు ఆహరహరం శ్రమించారు. ఆ పోరాటంలో ఆయనదే అంతిమ విజయం.