https://oktelugu.com/

Ramoji Rao Passed Away: ఆ కమ్మ దనం ఎందుకు?.. నాపై కులముద్ర వద్దు..

కులముద్రతో రామోజీరావును చూసేందుకు చాలామంది వెంపర్లాడేవారు.. ఇదే విషయాన్ని ఆయనను బాగా దగ్గరగా గమనించిన వారు పలు సర్కిళ్లల్లో కథలు కథలుగా చెబుతుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 8, 2024 / 12:29 PM IST

    Ramoji Rao Passed Away

    Follow us on

    Ramoji Rao Passed Away: “ఈనాడు పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావు కమ్మ కులస్తుడు. తెలుగు పత్రికా రంగంలోకి కులాన్ని తెచ్చిన వ్యక్తి. ఆయన పత్రికలో కమ్మ కులానికి చెందిన వారే ఎక్కువమంది ఉంటారు.. వారే కీలక స్థానాల్లో ఉంటారు. చాలామంది పొట్ట కొట్టిన పాపం రామోజీరావుది. అందువల్లే చాలామంది పాత్రికేయ రంగంలో ఎదగలేక, ఆ రంగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.. ముమ్మాటికి ఆ పాపం ఆయనకు తగులుతుంది” రామోజీరావు గతించిన తర్వాత.. సోషల్ మీడియాలో ఒక జర్నలిస్ట్ ఆవేదనతో పెట్టిన పోస్టు అది. చంద్రబాబుతో అంట కాగినంత మాత్రాన.. ఎన్టీ రామారావును గద్దెనెక్కించినంతమాత్రాన.. రామోజీరావు లో నూటికి నూరుపాళ్ళు కమ్మదనం మాత్రమే ఉందా? నిజంగా ఆయన కులానికి మాత్రమే ప్రాధాన్యమిస్తాడా? ఈ ప్రశ్నలకు అవును అని కాని, కాదు అని కాని సమాధానాలు లభించవు. కానీ ఒకటి మాత్రం సుస్పష్టం కులం అనే గుంజాటంలో రామోజీరావు ఉండడు.

    కులముద్రతో రామోజీరావును చూసేందుకు చాలామంది వెంపర్లాడేవారు.. ఇదే విషయాన్ని ఆయనను బాగా దగ్గరగా గమనించిన వారు పలు సర్కిళ్లల్లో కథలు కథలుగా చెబుతుంటారు.”రామోజీరావు మీద కులం ముద్రవేయాలని చూస్తే ఆయన చెప్పేది ఒకటే. పుట్టుకతో వచ్చింది పోదు.. నా ఇంటి పేరునే నేను వదిలేసుకున్నాను. ఇంకా ఆ కులం కుంపటిలో ఎందుకు ఉంటాను? మీరు ఒక బస్సు ఎక్కితే.. అందులో రకరకాల నేపథ్యాలకు చెందిన వారు కనిపిస్తుంటారు. వారందరినీ సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాలని డ్రైవర్ అనుకుంటాడు. ఆ డ్రైవర్ మీ నేపథ్యాలు, ఇతర వాటిని పరిశీలించడు కదా. నేనూ అలాంటివాడినే. నేను స్థాపించిన సంస్థలలో ఎంతో మంది ఉన్నారు. వారి కులం ఏమిటో, మతం ఏమిటో నాకు ఇప్పటికీ తెలియదు.. వేసేవాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు. రాళ్లను భరించడం నాకు కొత్త కాదు” అని అనేవారని రామోజీ సంస్థల్లో పని చేసిన ఉద్యోగులు చెప్పుకుంటుంటారు.

    దేవుడిని నమ్మని రామోజీరావు.. సూర్యుడిని మాత్రం విపరీతంగా ఆరాధిస్తాడు. ప్రభాత సూర్యుడు తన ప్రత్యక్ష దైవం అని చెబుతుంటాడు. అందుకే తన సినిమా బ్యానర్ కు ఉషా కిరణ్ మూవీస్ గా పేరు పెట్టాడు.. ఆ సూర్యుడిలాగే రామోజీరావు ఎవరు ఎలా అనుకున్నా కర్మయోగిలాగా జీవించాడు.. కర్మాచరణను వదిలిపెట్టలేదు. క్రియాశీల తత్వాన్ని జార విడువలేదు. అందుకే తన శేష జీవితంలో చివరి రోజున సైతం తన పత్రికను చదివాడు. ఎడిటోరియల్ సిబ్బందికి సలహాలు ఇచ్చాడు.. అందుకే అంటారు ఏవం కర్మ చ కర్తా అని.. దాన్ని తుది కంట పాటించాడు.. లాభాలు, కష్టాలు, కన్నీళ్లు.. ఇలా అన్నింటినీ చూశాడు. చివరికి తాను నిర్మించుకున్న రామోజీ ఫిలిం సిటీ లోనే పార్థివ దేహంగా మిగిలిపోయాడు.. కొంతమంది వ్యక్తులకు ఉపోద్ఘాతాల అవసరం లేదు. విశ్లేషణలు అవసరం లేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా రాసినా.. మరెన్ని విధాలుగా విమర్శించినా.. రామోజీరావు ఒక సముద్రం.. ఒక విస్ఫోటనం.. మండే భాస్వరం.. ప్రజ్వరిల్లే భాస్కరం..