Pandikona Dog Breed: కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తుంటారు. కానీ కొన్ని కుక్కలు నిజంగానే సింహాల లాగా దాడులు చేస్తుంటాయి. అడవి జంతువుల పీకలు సైతం కొరికేస్తుంటాయి. అలాగని అవి అడవి కుక్కలు కావు.. స్థూలంగా చెప్పాలంటే శునకం రూపంలో ఉన్న చిరుతలు.. వాటిని పందికోన కుక్కలు అని పిలుస్తారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా లోని పందికోన అనే గ్రామంలో ఈ కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కల వల్లే ఆ గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.
పందికోన కుక్కలు చూడ్డానికి సాధారణంగా ఉంటాయి. బక్క పలచటి దేహంతో కనిపిస్తాయి. కానీ వాటికి ఏమైనా అనుమానం వస్తే వెంటనే దాడి చేస్తాయి. చీల్చి చెండాడుతాయి. ఈ కుక్కలు ప్రత్యేకంగా ఉండడంతో ఇతర దేశాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి వీటిని కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఇప్పటికీ తీసుకెళ్తూనే ఉంటారు. ఆ కుక్కలు పోలీస్ సేవలతో పాటు మూగజీవాలకు రక్షణగా ఉంటాయి. పంట పొలాలకు కాపలా కాస్తుంటాయి. క్రూర మృగాలను తరిమికొడుతుంటాయి. వీటికి పౌరుషం ఎక్కువ. వేటాడే తత్వం చాలా ఎక్కువ. గాంభీర్యంగా ఉంటాయి. ఈ కుక్కలకు ఉన్న ప్రత్యేక లక్షణాల వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు పెద్దపెద్ద ధనవంతుల నంచి అధికారుల వరకు పందికోన గ్రామానికి వస్తూ ఉంటారు.
ఈ పందికోన గ్రామాన్ని బ్రిటిష్ కాలంలో పాలెగాళ్లు పాలించేవారు. అప్పట్లో అడవుల నుంచి క్రూర మృగాలు గ్రామాల్లోకి వస్తూ ఉండేవి. అలా ఒకసారి గ్రామంలోని సత్రంలో చిరుత పులి ప్రసవించింది. దానికి పుట్టిన మగ చిరుత ఆడ కుక్కలతో కలిసి సంచరించింది. ఆ తర్వాత మగ చిరుత పెరిగి ఆడ కుక్కలతో జత కట్టింది. ఫలితంగా చిరుతపులి లాంటి కుక్కలు పుట్టాయి. అలా అలా ఆ సంతానం వృద్ధి చెంది పందికోన కుక్కల జాతి వృద్ధి చెందింది. ఈ గ్రామంలో మొత్తం 700 కుటుంబాలు ఉన్నాయి.. మీరు మొత్తం 1500కు పైగా కుక్కలను పెంచుతున్నారు. ఈ కుక్కలకు పేర్లు కూడా పెట్టారు. చిన్న వయసులోనే వాటి శరీరంపై రెండువైపులా వాతలు పెడతారు. ఈ కుక్కలు ప్రత్యేకంగా ఆహారం అంటూ తినవు . వాటి యజమానులు తినే ఆహారాన్నే పెడుతుంటారు. పప్పు అన్నం, జొన్న రొట్టెలు, చికెన్, మటన్ ను ఇవి చాలా ఇష్టంగా తింటాయి. వీటి దంతాలు చాలా పదునుగా ఉంటాయి. వీటి చూపు కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమాత్రం అలికిడి వినపడినా ఇవి వెంటనే లేస్తాయి. అనుమానం వస్తే చాలు తరిమి తరిమి కొడతాయి. అవకాశం దొరికిందా పీక కొరికి చంపేస్తాయి. అందు గురించే ఈ జాతి కుక్కలను కొనుగోలు చేసేందుకు ఇతర దేశాల నుంచి వస్తుంటారు. అడవి పందులను ఈ కుక్కలు ఇష్టంగా తింటాయి. అంతేకాదు దొంగలపై దాడి చేయడం ఈ కుక్కల ప్రత్యేకత. ఇక డిస్కవరీ ఛానల్ ప్రతినిధులు ఈ కుక్కలను పరిశీలించి ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టారు.