India Today Cvoter Survey: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోంది. మరో నాలుగు నెలల్లో రెండేళ్ల పాలన పూర్తి కానుంది. ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని కూటమి చెబుతోంది. కానీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిందని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే విజయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో ఏపీలో ప్రజల మూడ్ ఎలా ఉంది అని ఒక సర్వే తేల్చింది. ఎప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? అనే దానిపై పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇండియా టుడే సి ఓటర్ సర్వే చేసింది. వాటి ఫలితాలను వెల్లడించింది. అయితే ఈ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఓటు షేర్ ప్రకటించడం విశేషం. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సర్వే కొనసాగింది. కానీ ఏపీలో మాత్రం ఆసక్తికర ఫలితాలను ప్రకటించింది.
* టిడిపి కూటమి ఘనవిజయం..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతోంది. జూన్ నాటికి రెండేళ్లు పూర్తి కానుంది. ఇటువంటి తరుణంలో ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్( India today sea water mode of the nation ) పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఏపీలో ఎప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందని అంచనాలతో సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో టిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. మొన్నటి ఎన్నికల్లో 53% ఓట్లను టిడిపి కూటమి దక్కించుకుంది. అయితే మరో రెండు శాతం ఓట్లను మెరుగుపరుచుకొని 55% ఓట్లు సాధిస్తుందని సర్వే తేల్చడం విశేషం. ఎంపీ సీట్ల విషయానికి వస్తే కూటమికి 22 నుంచి 24 సీట్లు వస్తాయని అంచనా వేసింది. వైసిపి ఓటు శాతం మాత్రం 40 నుంచి 39 శాతానికి పడిపోనుంది. ఆ పార్టీకి ఒకటి నుంచి మూడు మూడు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వే తేల్చి చెప్పింది. కాంగ్రెస్ తో పాటు ఇతరులు కలిపి ఓ 6% ఓట్లు దక్కించుకుంటారని అంచనా వేస్తోంది.
* మరోసారి కూటమికే ఛాన్స్..
ఈ తాజా సర్వే తో ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారని స్పష్టమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 164 స్థానాల్లో జయభేరి మోగించింది. పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే 25 కు గాను 21చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం పార్టీ 16 చోట్ల, బిజెపి మూడు చోట్ల, జనసేన రెండు చోట్ల విజయం సాధించాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాలకు పరిమితం అయింది. అయితే తాజా సర్వే తో ఓట్ల శాతాన్ని పెంచుకుంది కూటమి. సీట్ల పరంగా కూడా 24 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి అయితే ఈ తాజా సర్వే కూటమిలో ఆనందం నింపగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆందోళన రేపింది.