AP Land Registration Charges: ఏపీ( Andhra Pradesh) ప్రజలకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది కాకమునుపే బాదుడు ప్రారంభించింది. ఏకంగా రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. ఇందుకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతూ ఈ రోజు నుంచి అమలు చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో విలువలు తగ్గించగా.. మరి కొన్నిచోట్ల భారీగా పెంచారు.. ఇంకొన్ని చోట్ల యధాస్థితి కొనసాగించారు. అయితే సగటున 20 శాతం విలువలు పెంచినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే ప్రాంతాలతో పాటు రియల్ ఎస్టేట్ భూమ్ ఉన్న ప్రాంతాల్లో భారీగా భూముల విలువ పెంచారు. దీంతో రిజిస్ట్రేషన్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. ప్రధానంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో భూముల విలువ పెరగడం విశేషం. అయితే అదే జిల్లాలో కొన్నిచోట్ల విలువలను తగ్గించారు.
* ఆదాయం పెంచుకునేందుకు
సాధారణంగా భూముల విలువలను ( land values) ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు పెంచుతూ ఉంటాయి. తద్వారా రిజిస్ట్రేషన్ ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే ఆలోచన చేసింది. గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో భూముల ధరలను పెంచితే టిడిపి రోడ్డుపైకి వచ్చేది. ఆందోళన కార్యక్రమాలు చేపట్టేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల కాకమునుపే ఇప్పుడు భూముల విలువలను పెంచడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఆదాయం పెంచుకునేందుకే రిజిస్ట్రేషన్లకు సంబంధించి రుసుము పెంచుకునేందుకు.. ఇలా ప్రభుత్వం జీవో ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ విలువల పెంపు కూడా కొన్ని జిల్లాల విషయంలో మినహాయింపు ఇచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువ పెంపు అనేది అమల్లోకి వచ్చింది. అయితే రిజిస్ట్రేషన్ ల కోసం ఒక్కసారిగా వెళ్ళిన వారు ఆందోళనకు గురవుతున్నారు.
* కొన్నిచోట్ల తగ్గింపు
ప్రధానంగా గుంటూరు( Guntur district) జిల్లాలోని కొన్నిచోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్టార్ కార్యాలయం పరిధిలో ఎక్కరా పొలం రిజిస్ట్రేషన్ విలువ రూ. 1.96 కోట్లు ఉండగా.. దానిని ఇప్పుడు 30 లక్షలు చేశారు. అదే సమయంలో విజయవాడలో మూడు నుంచి తొమ్మిది శాతానికి ఆస్తుల విలువలు పెరిగాయి. గ్రేటర్ విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లి పట్టణంలో యధాతధంగా ఉంచి.. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24 నుంచి 32 శాతం వరకు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు.
* అప్పట్లో టిడిపి ఆందోళనలు
అయితే వైసీపీ( YSR Congress) ప్రభుత్వ హయాంలో ఇలానే భూముల విలువలు పెంచితే టిడిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేది. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసేది. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అదే పని చేయడంతో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై బాహటంగానే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు టిడిపి నేతలు. మరోవైపు కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలతో పాటు నీటి చార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రజల్లో కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకత ప్రారంభం కావడం ఖాయం.
* త్వరలో సంక్షేమ పథకాలు
త్వరలో సంక్షేమ పథకాలను( welfare schemes) ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముందుగా అన్నదాత సుఖీభవ పేరిట రైతులకు సాగు సాయం కింద 20,000 చొప్పున నగదు అందించేందుకు సిద్ధపడుతోంది. ఇంకోవైపు ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి 15000 రూపాయలు అందించేందుకు కూడా సిద్ధపడుతోంది. అయితే ఒకవైపు సంక్షేమంతో పాటు మరోవైపు బాదుడు ప్రారంభించాలని చూస్తున్నట్లు పరిస్థితి అర్థం అవుతోంది. మొత్తానికి అయితే తాము అధికారంలోకి వస్తే ఎటువంటి చార్జీలు పెంచబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వరుస బాదుడు తప్పేలా కనిపించడం లేదు.