https://oktelugu.com/

YCP: వైసీపీలో నెక్స్ట్ వికెట్స్ ఆ ఇద్దరే!

ఘోర పరాజయం తర్వాత వైసిపి నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్తున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట నేతలు రాజీనామా ప్రకటిస్తూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇద్దరు మాజీ మంత్రుల వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

Written By: , Updated On : December 13, 2024 / 01:04 PM IST
YCP Party

YCP Party

Follow us on

YCP: వైసీపీలో ఇప్పుడు అందరి చూపు శ్రీకాకుళం వైపు ఉంది. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్లు పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ శ్రీకాకుళం నుంచి రెండు వికెట్లు పడతాయని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అసలు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. అటు తాడేపల్లిలో జరిగే సమీక్షలకు సైతం హాజరు కావడం లేదు. చివరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కూడా గైర్ హాజరవుతున్నారు. ఆయన తప్పకుండా పార్టీ మారుతానన్న ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇటీవల పార్టీ సైతం ధర్మానను సంప్రదించింది. పార్టీలో కొనసాగండి. లేకుంటే సమర్ధుడైన నేత పేరును సూచించండి. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తాం అంటూ సజ్జల నుంచి ధర్మానకు ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తనకు కొంత సమయం కావాలని ధర్మాన అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగ కూడదని ధర్మాన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

* వైసీపీలో ఉండకపోతే సేఫ్
గతంలో ధర్మానపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ భూముల వ్యవహారంలో ధర్మాన పాత్ర ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీలో యాక్టివ్ అయితే ఆ కేసులు మెడకు చుట్టుకోవడం ఖాయం. అలాగని వైసీపీలో ఉంటే తనతో పాటు కుమారుడికి సరైన రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు ధర్మాన. తనకు సముచిత స్థానంతో పాటు కుమారుడి భవిష్యత్తుకు భరోసా కల్పించే కూటమి పార్టీల్లో చేరాలని ధర్మాన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కొద్ది రోజులు వేచి చూసి కూటమి లోని ఏదో ఒక పార్టీలో చేరాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో.. ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

* ఆగ్రహంతో రగిలిపోతున్న తమ్మినేని
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో సీనియర్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం జగన్ వైఖరి పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండా ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతలను మరో నేత చింతాడ రవికుమార్ కు అప్పగించారు జగన్. అప్పటినుంచి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు తమ్మినేని సీతారాం. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు సీతారాం. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో గెలిచి మంత్రి పదవిని ఆశించారు. కానీ జగన్ మాత్రం ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అయిష్టత గానే గత ఐదేళ్లుగా ఆ పదవిలో కొనసాగారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి తనను ఇన్చార్జి పదవి నుంచి తొలగించడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారిని ఇన్చార్జిలుగా కొనసాగించి.. తనను మాత్రమే తొలగించడం పై ఆగ్రహంతో ఉన్నారు. అవసరమైతే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.