AP Assembly Budget Session 2024: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుపై స్పష్టత వచ్చింది. నాలుగు నెలల స్వల్ప కాలానికి గాను ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ. 2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తూ కీలక రంగాలకు కేటాయింపులు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెనాయుడు సభలో ప్రవేశపెట్టారు. రూ.43,402 కోట్లు కేటాయిస్తూ..రైతుల పథకాలకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది.వ్యవసాయ బడ్జెట్ ప్రకటించినప్పుడు మంత్రి అచ్చెనాయుడు చాలా అంశాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు రైతులకు ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేశారు.సాగుకు సంబంధించిప్రతి అంశానికి నిధులు కేటాయించారు.చివరిగా అన్నదాత సుఖీభవ విషయంలో సైతం మరింత స్పష్టత ఇవ్వగలిగారు.
* వైసిపి హయాంలో రైతు భరోసాగా
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది.ఎకరాకు 7500 రూపాయల సాయం అందించేది. కేంద్రం అందించే 6000 రూపాయలతో కలిపి..మొత్తం 13,500 రైతులకు అందేది. అయితే తాము అధికారంలోకి వస్తే ఆ మొత్తాన్ని 20000 కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా దీనిపై స్పష్టత లేదు. అసలు ఈ పథకం అమలు చేస్తారా?లేదా?అని రైతులు అనుమానాలు వ్యక్తం చేశారు.మాజీ సీఎం జగన్ సైతం చాలా సందర్భాల్లో ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. ఈ తరుణంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెనాయుడు అన్నదాత సుఖీభవ పథకానికి కేటాయింపులు చేశారు. దీంతో అతి త్వరలో ఈ పథకం అమలవుతుందని తెలుస్తోంది.
* సంక్రాంతికి అన్నదాత సుఖీభవ
ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక అని మంత్రి అచ్చెనాయుడు స్పష్టం చేశారు. బడ్జెట్లో కేటాయింపులపై విపులంగా వివరించారు. 240 కోట్లతో రాయితీ విత్తనాలు కొనుగోలు చేస్తామని..ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తామని ప్రకటించారు.భూసార పరీక్షల కోసం 38.88 కోట్లు, విత్తనాల పంపిణీకి 240 కోట్లు, ఎరువుల సరఫరాకు 40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు పొలం పిలుస్తోంది కార్యక్రమానికి 11.31 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి ₹422 కోట్లు,డిజిటల్ వ్యవసాయానికి 44.77 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 187.68 కోట్లు, వడ్డీ లేని రుణాలకు 628 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి 4500 కోట్లు, రైతు సేవా కేంద్రాలకు 26.9 2 కోట్లు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కు 44.3 కోట్లు, వ్యవసాయ శాఖకు 8,564.37 కోట్లు,ఉద్యాన శాఖకు 3469.47 కోట్లు, పట్టు పరిశ్రమకు 108.4 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్ కు 314. 80 కోట్లు,సహకార శాఖకు 308.26 కోట్ల మేరకు కేటాయింపులు చేశారు.అయితే అన్నింటికీ మించి అన్నదాత సుఖీభవ పథకానికి క్లారిటీ వచ్చింది.4500కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడంతో తప్పకుండా అమలు చేస్తారని తెలుస్తోంది.జనవరిలో ఈ పథకం అమలు చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి.