https://oktelugu.com/

Jagan: కొత్తగా ఈ ప్రయోగాలు ఏంటి.. జగన్ తీరుపై వైసీపీ శ్రేణుల్లో అసహనం

ఎక్కడైనా సరికొత్త ప్రయోగాలు ముఖ్యమే. అయితే అందుకు తగ్గ పరిస్థితులు చూసి ప్రయోగాలు చేయాలి. చేతులు కాలాక కూడా వైసీపీ అధినేత జగన్ ( Jagan Mohan Reddy) అటువంటి ప్రయోగాలే చేస్తున్నారు.

Written By: , Updated On : January 11, 2025 / 01:37 PM IST
Jagan(2)

Jagan(2)

Follow us on

Jagan: వైసీపీలో జగన్ ( Jagan Mohan Reddy) మరోసారి ప్రయోగాలు చేస్తున్నారా? నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమిస్తుండడం దేనికి సంకేతం? ముక్కు ముఖం తెలియని వారిని సైతం బలంగా రుద్దుతుండడంతో వైసీపీ శ్రేణులు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నారు జగన్. అయినా సరే గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు ఎక్కడికక్కడే కొత్త ఇన్చార్జిలను తెస్తున్నారు. పోనీ ఇప్పుడున్న వారి కంటే బలమైన వారిని.. దూకుడుగా ఉన్న వారిని తెస్తున్నారంటే అది కాదు. కొన్నిచోట్ల కుల సమీకరణల పేరుతో కొత్త వారిని తెస్తున్నారు. మరి కొన్నిచోట్ల ద్వితీయ శ్రేణి నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పార్టీలో ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది. ఎక్కడైనా చేర్పులు మార్పులు చేస్తే అంతకుమించి అన్నట్టు ఉండాలి. కానీ వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

* తమ్మినేనిని తప్పించారు
వైసీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు తమ్మినేని సీతారాం ( tammineni Sitaram) . సుదీర్ఘకాలం ఆయన ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటమి చవి చూశారు. 2019 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ స్పీకర్ స్థానాన్ని కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో సీతారాం మూడోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనను నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించి… చింతాడ రవికుమార్ అనే ద్వితీయ శ్రేణి నాయకుడికి బాధ్యతలు అప్పగించారు. అయితే తన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కానీ.. పోనీ మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతిని తీసుకొచ్చి ఇన్చార్జి పదవి కట్టబెట్టి ఉంటే బాగుండేదని.. కానీ తన సీనియారిటీని అగౌరవపరిచారని తమ్మినేని తెగ బాధపడుతున్నారు.

* అంబటి అవుట్
తాజాగా సత్తెనపల్లి ఇన్చార్జిగా ఒక యువనేతను తీసుకొచ్చారు జగన్. సుధీర్ రెడ్డి అనే డాక్టర్ను తెరపైకి తెచ్చారు. జగన్ కు అత్యంత విధేయుడుగా ఉండే మాజీ మంత్రి అంబటి రాంబాబును( ambati Rambabu) తప్పించారు. దీంతో ఈ నియామకం వెనుక ఉన్న వ్యూహం ఏంటన్నది తెలియడం లేదు. అసలు సుధీర్ రెడ్డి అనే నేత కనీస సంబంధాలు లేవు సత్తెనపల్లి తో. కానీ కుల సమీకరణాల పేరుతో ఆయనను ఇక్కడికి తీసుకొచ్చారు. దీంతో నొచ్చుకుంటున్నారు అంబటి రాంబాబు. పైకి ఎటువంటి అసంతృప్తి లేదని చెబుతున్నా.. లోలోపల మాత్రం తెగ బాధపడుతున్నారు.

* కాసు మహేష్ రెడ్డికి ప్రమోట్
నరసరావుపేట విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ ఇన్చార్జిగా శ్రీనివాస్ రెడ్డి( Srinivas Reddy) ఉన్నారు. ఆయనను పక్కనపెట్టి కాసు మహేష్ రెడ్డిని తెరపైకి తెస్తారని ప్రచారం నడుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు శ్రీనివాస్ రెడ్డి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో ఓడిపోయారు. అయితే నియోజకవర్గంలో తనకంటూ ఇమేజ్ పెంచుకున్నారు శ్రీనివాస్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆయనను కాదని కాసు మహేష్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అనుచరుల్లో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. అదే జరిగితే ఈ నియోజకవర్గంలో వైసీపీలో అడ్డగోలుగా విభేదాలు తలెత్తుతాయని ప్రచారం నడుస్తోంది.

* అద్దంకి తెరపైకి బలరాం
అద్దంకి నియోజకవర్గ బాధ్యతలను సీనియర్ నేత కరణం బలరాం( karanam Balaram ) కుటుంబానికి అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే చీరాలలో బలరాం కుటుంబం స్థిరపడింది. రాజకీయంగా నిలదొక్కుకుంది. అక్కడ కరణం బలరాం కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చారని భావించి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు అదే కరణం కుటుంబాన్ని తిరిగి అద్దంకి బాధ్యతలు అప్పగిస్తామనడం దేనికి సంకేతం అని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్నారు కరణం బలరాం. కానీ ఇప్పుడు అక్కడ టిడిపి పటిష్టంగా ఉంది. పైగా కరణం బలరాం కుటుంబం తిరిగి టిడిపిలో చేరిపోతుందని ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు వారిని తెచ్చి అద్దంకి బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

* ఎన్నికలకు ముందు అలా
అయితే ఎన్నికలకు ముందు జగన్( Jagan Mohan Reddy) ఇటువంటి ప్రయత్నం చేశారు. చాలా రకాల ప్రయోగాలు చేశారు. దాదాపు 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి తర్వాత రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తున్నారు. బలవంతంగా కొంతమందిని నియోజకవర్గాలను మార్చే పనిలో ఉన్నారు. దీనిపై వైసీపీలోనే ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది. అధినేత తీరుపై పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. మున్ముందు ఇలాంటి పరిణామాలు ఎన్ని చూడాలో అని వైసిపి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.