Dharmana Prasada Rao Quits YSRCP: జగన్(YS Jagan Mohan Reddy ) సహనాన్ని పరీక్షిస్తున్నారు ఆ సీనియర్. పార్టీలో కొనసాగుతున్నారే తప్ప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అలాగని పార్టీకి రాజీనామా చేయడం లేదు. పార్టీలో కొనసాగుతానని కూడా చెప్పడం లేదు. దీంతో ఆ సీనియర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి విసిగి వేసారి పోయారు. పార్టీలో ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి అని తేల్చి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ అంటే? అందరి చూపు శ్రీకాకుళం జిల్లా వైపు పడుతోంది. ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధర్మాన ప్రసాదరావు వైఖరి ఎప్పుడు అనుమానమే. అనుమానాస్పదమే. అందుకే ఇప్పుడు జగన్ ఆయన విషయంలో అంతిమ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
చిన్న వయసులోనే మంత్రిగా..
కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డికి అభిమానించే నేతల్లో ధర్మాన ప్రసాదరావు( Dharmana Prasad Rao ) ఒకరు. గెలిచిన తొలిసారి మంత్రి అయ్యారు ధర్మాన. యువజన కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ధర్మాన.. 1989లో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఉత్తరాంధ్రలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. అందుకే 2004లో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు. అయితే అదే 2004లో తన సొంత నియోజకవర్గాన్ని అన్నయ్య కృష్ణదాస్కు ఇచ్చి.. తాను మాత్రం శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి మారారు. ఆ ఎన్నికల్లో ఇద్దరు అన్నదమ్ములు గెలిచారు. 2009లో సైతం అదే మాదిరిగా ఫలితాలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత సోదరులు ఇద్దరి మధ్య చీలిక వచ్చింది. కృష్ణదాస్ వైసీపీలోకి వెళ్లారు. అయితే 2014 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు వైసీపీ గూటికి వచ్చారు. అయితే జగన్ వైసీపీ ఏర్పాటు చేసిన సమయంలో ధర్మాన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అనుచితంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయంగా తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో చేరిన ధర్మాన ప్రసాదరావు 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. కృష్ణ దాస్ సైతం నరసన్నపేట నుంచి ఓటమి చవి చూశారు.
కృష్ణ దాస్ కు ప్రాధాన్యం..
2019 ఎన్నికల్లో మాత్రం సోదరులు ఇద్దరూ గెలిచారు. కానీ ధర్మాన ప్రసాదరావు వైఖరి గమనించిన జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆది నుంచి వైసీపీలో కొనసాగి.. తనకు అండగా నిలబడిన కృష్ణ దాస్ కు( dharmana Krishna Das ) ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు ధర్మాన ప్రసాదరావు ఫుల్ సైలెంట్ అయ్యారు. పార్టీతో సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. అయితే పునర్విభజనలో కృష్ణ దాస్ కు తప్పించి ధర్మాన ప్రసాదరావుకు అవకాశం కల్పించారు జగన్. కానీ 2024 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు ఓడిపోయిన తర్వాత పార్టీలో కనిపించడం లేదు. ఆయన సోదరుడు కృష్ణదాస్ మాత్రం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. సోదరుడు ధర్మాన ప్రసాదరావును పార్టీలోకి తిరిగి యాక్టివ్ చేసేందుకు కృష్ణదాస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ధర్మాన ప్రసాదరావు నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన లేదు.
కుమారుడి కోసం వేరే ఆలోచనతో..
ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు పొలిటికల్ ఎంట్రీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడిని నిలబెడతానని ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డిని కోరారు. అందుకు ఆయన అంగీకారం తెలపలేదు. మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురయింది ధర్మానకు. టిడిపికి చెందిన ఓ సామాన్య సర్పంచి చేతిలో 52 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు. అందుకే ఇప్పుడు ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు అండగా నిలిచే పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నారు. అయితే ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ కాకపోవడం, వేరే ఆలోచనతో ఉండడంతో.. పార్టీలో ఉంటే ఉండండి.. లేకుంటే బయటకు వెళ్లిపోండి అని జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది.