TDP Janasena BJP Alliance: ఏపీలో రాజకీయ నాయకులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాలికి బలపం కట్టుకున్నట్టుగా తిరుగుతున్నారు. ఓ వర్గం మీడియా ఈ పరిణామాలను గొప్పగా చిత్రీకరిస్తుంటే.. మరో వర్గం మీడియా నెగిటివ్ కోణంలో ప్రచారం చేస్తోంది. ఫలితంగా ఏపీలో రాజకీయ పరిణామాలు చిత్ర విచిత్రంగా మారుతున్నాయి.. ఎవరితో పొత్తు పెట్టుకోకుండా, స్థానాలకు అభ్యర్థులను మారుస్తూ జగన్ సరికొత్త రాజకీయాలకు తెరలేపుతుండగా.. తెలుగుదేశం, జనసేన, బిజెపి సంయుక్తంగా పోటీ చేస్తామని ప్రకటిస్తున్నాయి.. పొత్తుకు సంబంధించి ఇంకా కొన్ని విషయాల్లో స్పష్టత రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు పొత్తు కుదిరింది, అన్ని విషయాలపై స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే తీరుగా ఆయన పొత్తులు పెట్టుకున్నారు. తర్వాత జనసేనకు, బిజెపికి దూరం జరిగారు. ఇప్పుడు మళ్లీ వాటితో అంట కాగుతున్నారు.
ఇదంతా చూస్తుంటే బాగానే ఉన్నప్పటికీ.. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అధికారం దూరమైతే ఈ కూటమి పరిస్థితి ఏమిటి? అప్పటికి చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్టే. వయసు రీత్యా చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకుని, భారతీయ జనతా పార్టీతో పోతు పెట్టుకుని.. అన్ని రకాలుగా విమర్శించి.. ఓ వర్గం మీడియాను చెప్పు చేతుల్లో ఉంచుకొని.. చివరికి ఎన్నికల్లో భయపడితే మాత్రం ఏపీ రాజకీయ చిత్రం నుంచి చంద్రబాబు దాదాపు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కూటమిలో ఉన్నప్పటికీ అధికారాన్ని దక్కించుకోకపోతే.. అందులో ఉన్న పార్టీలు తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తాయనడం లో సందేహం లేదని మీ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ అద్భుతంగా వాడుకుంటుంది. ఉత్తర భారతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు అందుకు బలమైన ఉదాహరణలు.. అలాంటి వాటి కోసం బిజెపి నాయకులు ముందుగా తగ్గినట్టు ఉంటారు. ఆ తర్వాత అసలు సినిమా చూపిస్తారు. తాత్కాలికంగా త్యాగాలు చేసి.. శాశ్వతంగా అధికారాన్ని పొందుతారు.
కొన్ని నెలల క్రితం ఇండియా కూటమిని ఏర్పాటు చేసినప్పుడు నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన బిజెపిపై విమర్శలు చేశారు. బిజెపి నాయకులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత సీన్ మారింది. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చారు. అప్పటిదాకా విమర్శించిన బిజెపి నాయకులతో దోస్తీ కుదుర్చుకున్నారు. వారు కూడా సపోర్ట్ ఇవ్వడంతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో బిజెపి పోటీ చేస్తోంది. అలాంటప్పుడు నితీష్ కుమార్ పార్టీకి గండం మొదలైనట్టే. ఇక మహారాష్ట్రలోనూ బిజెపి ఇటువంటి స్ట్రాటజీనే అమలు చేస్తోంది. అక్కడ చీలిక వర్గాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చి.. అనంతరం వాటి ఉనికినే లేకుండా చేస్తోంది.
అలాంటి బిజెపికి టిడిపితో మాత్రం ఎందుకు మినహాయింపులు ఉంటాయి? ఎలాగూ చంద్రబాబు నాయుడికి వయసు మీద పడుతున్నది. ఆయన కూడా చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ మీద ఆధారపడుతున్నారు. అలాంటప్పుడు భవిష్యత్తు కాలంలో బిజెపి ఎటువంటి అడుగులు వేసిన టిడిపికి ఇబ్బందే. కారణాలు ఏవైనా ఉండవచ్చును గాని.. చంద్రబాబు నాయుడు తనంతట తానే బిజెపి ఫోల్డ్ లోకి వెళ్లిపోయారు. బిజెపికి కొన్ని స్థానాలు ఇచ్చి, అందులో తనకు అనుకూలమైన వారిని నిలబెట్టాలనేది చంద్రబాబు ప్లాన్ కావచ్చు. ఇది ఆయన కోణంలో మంచిదే అయినప్పటికీ.. బిజెపి ఒకప్పటిలాగా ఆయన చెప్పే ప్రతి మాటను నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. పైగా అధికారం కోసం బిజెపి ఏదైనా చేస్తోంది. దానికి ఇటీవల ఉత్తరాఖాండ్ లో నెలకొన్న పరిస్థితులే పెద్ద ఉదాహరణ. సింపుల్ గా చెప్పాలంటే తన మిత్రపక్షాలను కూడా బిజెపి తీసి అవతల పడేస్తోంది. కుర్చీని మడత పెట్టి.. పాట తీరుగా రాజకీయాలు చేస్తోంది.