Minister Roja: వైసీపీలో అభ్యర్థుల మార్పు కలకలం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇప్పటివరకు 11 మంది అభ్యర్థులను వైసిపి హై కమాండ్ మార్చింది. కానీ ఈ జాబితా 80 వరకు ఉందని ప్రచారం జరుగుతోంది. విడతల వారీగా జాబితాలను వెల్లడించేందుకు వైసిపి నాయకత్వం కసరత్తు చేస్తుందన్న టాక్ నడుస్తోంది. అయితే ఈ జాబితాలో కీలక మంత్రులు, నాయకులు ఉన్నట్లు ఊహాగానాలు రేగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పేరు వినిపిస్తుండడం సంచలనం రేకెత్తిస్తోంది. ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వరన్న ప్రచారం జోరందుకుంటుంది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరిలో అభ్యర్థిని మారుస్తారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
అయితే ఈ ప్రచారంపై తాజాగా రోజా సీరియస్ గా స్పందించారు. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తానే నగిరి నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. తనకు టికెట్ రాదని కొంతమంది శునకానందంతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కార్యక్రమాల్లో తాను ముందు వరుసలో ఉన్నానని.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎక్కడ వైసిపి హై కమాండ్ కు వ్యతిరేకంగా ఆమె మాట్లాడకపోవడం విశేషం.
తాను పోటీ చేసేది లేనిది హై కమాండ్ కు స్పష్టంగా తెలుసునని.. లేనిపోని ప్రచారాన్ని నమ్మనని తేల్చేశారు. తనకు టిక్కెట్ రాకూడదని అనుకునే వారి ఆశలు ఎట్టి పరిస్థితుల్లో తీరవని కూడా తేల్చి చెప్పారు. అనివార్య పరిస్థితుల్లో తనకు టిక్కెట్ రాకపోయినా.. మరొకరికి వచ్చినా.. మనస్ఫూర్తిగా తాను గెలిపించుకుంటానని కూడా స్పష్టం చేశారు. టికెట్ విషయానికి పక్కన పెడితే తనకు తాను జగనన్న సైనికురాలినని ప్రకటించుకున్నారు. టిక్కెట్ విషయంలో జగన్ మాటే శిరోధార్యము అని తేల్చేశారు. మొత్తానికైతే తనకు టిక్కెట్ రాకపోయినా వైసీపీకి పనిచేస్తానని రోజా కృతజ్ఞతా భావంతో చెప్పడం విశేషం.