Kumara Swamy – Pawan Kalyan : కర్నాటకలో మరోసారి కుమారస్వామి సీఎం పదవికి దగ్గర అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలకు కూతవేటు దూరంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నిలవనున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ 80 స్థానాలకే పరిమితమైపోతుందని పోల్స్ చెబుతున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ తనకున్న శక్తియుక్తులను ఉపయోగించుకోవడంతో గతం కంటే మరో 20 స్థానాలను అదనంగా పొందనుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ కి కూతవేటు దూరంలోనే రెండు జాతీయ పార్టీలు నిలిచిపోయాయి. కేవలం 25 నుంచి 30 స్థానాలతో సరిపెట్టుకున్న కుమారస్వామి కీరోల్ ప్లే చేస్తారని తెలియడం అటు కాషాయదళానికి, ఇటు కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడడంలేదు.
రాజకీయాలకు దిక్సూచి..
అయితే ఇప్పుడు కర్నాకట రాజకీయం ఏపీకి దిక్సూచిలా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీతో పొత్తు విషయంలో పునరాలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ కు జనసేన శ్రేణులు సూచిస్తున్నాయి. ఒంటరి పోరే శ్రేయస్కరమని.. కర్నాటకలో కుమారస్వామి తరహాలో కింగ్ కానీ.. కింగ్ మేకర్ గా నిలవచ్చన్నది జన సైనికుల భావన. టీడీపీతో పొత్తుకు కుదిరితే చంద్రబాబు సీఎంగా అయ్యేందుకు మాత్రమే పనికొస్తుందని.. రెండు, మూడు మంత్రి పదవులతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని.. అదే ఒంటరిగా వెళితే ప్రభుత్వం ఏర్పాటులో కీరోల్ ప్లే చేసే అవకాశం చేజిక్కించుకోవచ్చని మెజార్టీ జనసేన శ్రేణులు తమ అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టుకొని చెబుతున్నాయి.
జన సైనికుల లెక్క ఇది..
ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార వైసీపీ 70 నుంచి 80 స్థానాలు దక్కే అవకాశముందని.. అటు టీడీపీ బలం పెంచుకొని 80 స్థానాల వరకూ దక్కించుకునే చాన్స్ ఉందని.. మిగతా 20 నుంచి 25 స్థానాలు జనసేనకు వచ్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా వైసీపీ, టీడీపీ కూతవేటు దూరంలో నిలిచిపోతాయని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ విముక్త ఏపీయే జనసేన లక్ష్యమని పవన్ ప్రకటించారు. ఆ లెక్కన వైసీపీకి అధికారాన్ని దూరం చేసి.. టీడీపీ సహకారంతో ప్రభుత్వం చేపడితే అసలు లక్ష్యం నెరవేరుతుందని జన సైనికులు లెక్కలు కడుతున్నారు.
కొద్దిరోజుల్లో క్లారిటీ..
అయితే టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశముంది. అది అంతిమంగా వైసీపీకే లాభిస్తుంది. ఈ క్రమంలో జనసేన తనకు బలమున్న నియోజకవర్గాల్లో పోటీచేసి .. మిగతా చోట్ల టీడీపీకి మద్దతు తెలిపితే ఎలా ఉంటుందనే విషయంపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో పొత్తులు కుదిరినా తమకు బలమున్న స్థానాలను విడిచిపెట్టాలని డిమాండ్ చేసే చాన్స్ ఉంది. అటు ఒంటరిగానైనా.. ఇటు పొత్తులో భాగమైనా.. ఎలా చూసుకున్నా 20 నుంచి 30 స్థానాలను గెలుపొందితే మాత్రం కర్నాకట మాదిరిగా చక్రం తిప్పే చాన్స్ ఉంది. కానీ పవన్ అంతటి సాహసం చేస్తారా? అన్నది చూడాలి మరీ.