Andhra Pradesh: నాకు కష్టమొచ్చింది… నా బాధను మీరూ షేర్‌ చేసుకోండి.. విపక్షాలు జగన్‌ ఆవేదన వైరల్

ఐదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్నారు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు విపక్ష టీడీపీ, జనసేన నేతలను అనేకరకాలుగా ఇబ్బంది పెట్టారు. చివరకు ఎన్నికలకు ఏడాది ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు కూడా చేసి జైల్లో పెట్టారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు జగన్‌ను అధికార టీడీపీ కూటమి ఇబ్బందులు పెడుతోంది. దీంతో కష్టాల్లో ఉన్నా ఆదుకోండి అని ఇప్పుడు విపక్షాలను కోరుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : July 22, 2024 3:58 pm
Follow us on

Andhra Pradesh: గతనెల జరిగిన సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అధికార వైసీపీ ఒంటరిగా బరిలో దిగింది. కూటమిని విచ్ఛిన్నం చేయడానికి అధికార పార్టీ అనేక ప్రయత్నాలు చేసింది. కానీ, కలిసి కట్టుగా వెళ్లిన ఎన్డీఏ కూటమి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. వైనాట్‌ 175 నినాదంతో ఎన్నికల్లో పోటీచేసిన జగన్‌ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 23 ఎంపీ స్థానాలు గెలిచిన వైసీపీ ఇప్పుడు 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్‌ ఎన్నికల్లో గెలిచినప్పటికీ అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత దారుణంగా పార్టీ ఓడిపోయింది. ఇక అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసే, బీజేపీ కూటమి ఇప్పుడు వైసీపీపై ప్రతీకారం తీర్చుకుంటోంది. గడినిన నెల రోజుల్లోనే వైసీపీ నేతల ఇళ్లు, ఆస్తులు, కార్యాలయాలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారు. హత్యలు చేస్తున్నారు. బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి అన్న చందంగా ఇప్పుడు వైసీపీ పరిస్థితి తయారైంది. అధికారం లేకపోవడం, వైసీపీ అండగా నిలిచే వారు కానరాకపోవడంతో జగన్‌ ఒంటరయ్యారు. ఒంటరిగా అయినా ఏపీ సర్కార్‌తో పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24న తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని చెప్పారు.

జగన్‌కు మద్దతు తెలిపేదెవరు?
గడిచిన ఐదేళ్లు వివిధ అంశాలపై పార్లమెంట్‌లో, బయట వైసీపీ ఎంపీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై విపక్షాలు పోరాటం చేసినా… వైసీపీ మాత్రం సంఘీభావం కూడా ప్రకటించలేదు. బీజేపీ తెచ్చిన బిల్లులను వ్యతిరేకించలేదు. పైగా ఏ బిల్లు పెట్టినా ఆ పార్టీకి చెందిన 23 మంది ఎంపీలు మద్దతు ఇస్తూ వచ్చారు. అందుకు ప్రతిగా జగన్‌పై ఉన్న కేసుల విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ జగన్‌ ప్రధాని మోదీతో సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపైనే పోరాటం..
ఇప్పుడు జగన్‌కు వచ్చిన సమస్యంతా ఏపీలోని టీడీపీ సర్కార్‌తోనే. టీడీపీ నేతలు ప్రతీకార దాడులతో వీరంగం సృష్టిస్తున్నారు. వైసీపీ నేతలను హతమారుస్తున్నారు. ఆ పార్టీ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఈ దాడులు ఇప్పుడే ఆగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మాజీ సీఎం జగన్‌ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గవర్నర్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. సోమవారం(జూలై 22న) నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చారు. ఇక ఈనెల 24న (బుధవారం) ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

కలిసి రావాలని పిలుపు..
ఏపీలోని ఏన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో తాను తలపెట్టే ధర్నాకు తరలిరావాలని జగన్‌ కోరారు. కానీ, ఆయనతో కలిసి ఎన్డీఏకు వ్యతిరేకంగా పోరాడే పార్టీ ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే జగన్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు.. పట్టుమని పది మంది ఎంపీలు లేరు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు. ఆయన చేస్తున్న ధర్నా ఏపీలో తన మైలేజీ పెంచుకోవడం, ప్రభుత్వాన్ని డ్యామేజ్‌ చేయడమే లక్ష్యంగా ఈ ధర్నా తలపెట్టారు. జగన్‌ సొంత ప్రయోజనాల కోసం చేస్తున్న ధర్నాకు విపక్షాలు ఎందుఉ కలిసి వస్తాయి.. ఎందుకు రావాలి అన్న ప్రశ్న కుడా తలెత్తుతున్నాయి. జగన్‌కు మద్దతు ఇస్తే నవ్వుల పాలవుతామని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. జగన్‌కు మద్దతు ఇచ్చేందుకు ఏ పార్టీ ఆసక్తిగా లేదు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ధర్నా చేయడం కన్నా.. పార్లమెంటు సమావేశాల వేళ తలపెట్టిన ఈ ధర్నాను ప్రత్యేక హోదా కోసం చేస్తే బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.