Hyderabad CP CV Anand: ఒకటి కాదు, రెండు కాదు బాహుబలి 2 సాధించిన రికార్డులతో మూడింతలు.. పుష్ప 2 సినిమా సాధించిన నాలుగింతలు.. ఇవేవో ఇటీవల వచ్చిన సినిమా సాధించిన అద్భుతాలు కాదు. వేలాదిమంది ఆధారపడిన టాలీవుడ్ పరిశ్రమ నష్టపోయిన డబ్బు. చదువుతుంటే వామ్మో అనిపిస్తోంది కదూ .. నిజంగా ఇంత డబ్బును టాలీవుడ్ కోల్పోయింది. అది కూడా ఒక్కడి వల్ల.. ఆ ఒక్కడు చేసిన అరాచకం వల్ల..
పలు సినిమాలను పైరసీ చేస్తూ.. వివిధ వెబ్సైట్లకు అమ్ముకుంటున్న కిరణ్ ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ కీలక విషయాలు వెల్లడించారు. సినిమాల పైరసీ కోసం ఏకంగా ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. దానిద్వారా సినిమాలను పైరసీ చేసి వివిధ వెబ్సైట్లకు అమ్ముకోవడం మొదలుపెట్టారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు డిజిటల్ శాటిలైట్ ను కూడా హాక్ చేశారు. పైరసీ సినిమాలు అప్లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనలతో ఆదాయం పొందారు. దీనికి టెలిగ్రామ్, టొరెంటో యాప్స్ ను ఉపయోగించుకున్నారు. బీభత్సంగా దండుకున్నారు. ప్రత్యేకమైన యాప్ ద్వారా ఏకంగా 40 కి పైగా సినిమాలను థియేటర్లోనే రికార్డింగ్ చేశారు. ఇందులో పెద్ద పెద్ద హీరోల నుంచి మొదలు పెడితే చిన్న చిన్న నటులు నటించిన సినిమాల వరకు ఉన్నాయి. ఈ పైరసీ ద్వారా ఏకంగా 3700 కోట్ల నష్టం వాటిల్లింది. వాస్తవానికి శక్తివంతమైన టెక్నాలజీ వాడుతున్నప్పటికీ దొరకకుండా కిరణ్ ముఠా సినిమాలను పైరసీ చేయడం విశేషం.
శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కేవలం సినిమాలను మాత్రమే కాదు.. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వెబ్సైట్లను సైతం హాక్ చేయగలిగే దమ్ము కిరణ్ ముఠా వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ప్రభుత్వ వెబ్ సైట్లను మీరు హ్యాక్ చేయకపోయినప్పటికీ.. భవిష్యత్తులో ఆదాయం కోసం అలాంటి దుర్మార్గానికి కూడా పాల్పడేందుకు వెనుకాడే వారు కాదని హైదరాబాద్ సీపీ చెబుతున్నారు. “కిరణ్ ముఠా వద్ద శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. దీని ద్వారా అనేక రకాల చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడుతున్నారు. దీనిద్వారా వందల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ డబ్బు మొత్తం అక్రమమార్గాలలో పెట్టుబడిగా పెడుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఏకంగా సంఘవిద్రోహశక్తులుగా మారేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని” ఆనంద్ పేర్కొన్నారు.