TDP: చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. ఆ దంపతులకు టిక్కెట్లు

వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడిగా వ్యవహరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరడంతో.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా వెళ్లాల్సి వచ్చింది.

Written By: Dharma, Updated On : March 16, 2024 8:19 am

TDP

Follow us on

TDP: తెలుగుదేశం పార్టీలో చాలామంది కొత్తవారికి టిక్కెట్లు దక్కాయి. అయితే వారంతా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. సీనియర్లకు టిక్కెట్లు దక్కని ఈ తరుణంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి టికెట్ ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు దంపతులకు టిక్కెట్లు ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి టిడిపి అసెంబ్లీ టికెట్ దక్కింది. అటు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగడం ఖాయంగా తేలింది. దీంతో ఈ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడిగా వ్యవహరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరడంతో.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా వెళ్లాల్సి వచ్చింది. దీంతో అక్కడ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. అటు నెల్లూరు లోక్ సభ అభ్యర్థిత్వాన్ని సైతం ఖరారు చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చితేనే తాను పోటీ చేస్తానని వేంరెడ్డి షరతు పెట్టారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానాన్ని తన భార్య ప్రశాంతి రెడ్డికి ఇవ్వాలని కూడా కోరినట్లు ప్రచారం జరిగింది. వేంరెడ్డి కోరినట్టే నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను జగన్ తప్పించారు. కానీ అనూహ్యంగా ఆయన సూచించిన డిప్యూటీ మేయర్ ఖలీల్ కు టికెట్ ఇచ్చారు. దీంతో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి భార్య ప్రశాంతి రెడ్డి తో కలిసి టిడిపిలో చేరారు.

అయితే స్పష్టమైన హామీ తోనే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరినట్లు తెలుస్తోంది. నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి చంద్రబాబు టికెట్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ పార్టీలో చేరారు. హామీ ఇచ్చినట్టుగానే ప్రశాంతి రెడ్డికి కోవూరు టిక్కెట్ను చంద్రబాబు ఖరారు చేశారు. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. ఒకానొక దశలో ప్రసన్న కుమార్ రెడ్డిని మార్చి ప్రశాంతి రెడ్డికి వైసీపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ వేంరెడ్డి దంపతులు టిడిపిలోకి వెళ్లడంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు అక్కడ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న వ్యక్తిని తప్పించి.. ప్రశాంతి రెడ్డి ని టిడిపి అభ్యర్థిగా ఖరారు చేయడం విశేషం. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని తెలుస్తోంది. ఆయన పేరు సైతం ఖరారు చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మొత్తానికైతే దంపతులకు టిక్కెట్లు ఇవ్వడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది.