AP Rain Alert: ఏపీలో( Andhra Pradesh) చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో ఈరోజు, రేపు చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం ఉభయగోదావరి జిల్లాలతో పాటు గుంటూరులో భారీ వర్షం నమోదయింది. ఈరోజు సైతం పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం అయింది. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపింది. బంగాళాఖాతం లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా.. పలు ప్రాంతాలకు వర్షము ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.
* తీరం వెంబడి ఈదురు గాలులు..
రెండు రోజుల పాటు భారీ వర్షాలు నేపథ్యంలో తీరం వెంబడి భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెబుతోంది. ప్రధానంగా ఏపీలోని ఉభయగోదావరి( Godavari districts) జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. వీటికి తోడు దక్షిణ కోస్తాతో పాటు తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం చాలా చోట్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరంలో తరచు వరద పోటెత్తుతోంది. చాలా ప్రాంతాల్లో సముద్రం ముందుకు వస్తోంది. అయితే మత్స్యకారులు తీర ప్రాంతం నుంచి తమ పడవలను, వేట సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
* నైరుతి రుతుపవనాల నిష్క్రమణ..
ఇంకోవైపు ఈ నెల 17 నాటికి నైరుతీ రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. ఈ ఏడాది దేశంలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో దేశానికి రుతుపవనాలు తాకుతాయి. కానీ ఈ ఏడాది మే 23 నాటికి.. అంటే 8 రోజుల ముందే రుతుపవనాలు ప్రవేశించాయి. సాధారణంగా ఖరీఫ్ నకు నైరుతి రుతుపవనాలే కీలకం. వీటి రాకతోనే దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అయితే 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు దేశానికి ముందుగా తాకడం ఇదే మొదటిసారి. అయితే ఈ ఏడాది ఏపీలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. జూన్, జూలై నెలలో వర్షపాతం లోటు ఉండేది. కానీ ఆగస్టు సమీపించేసరికి వర్షాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ మొదటి వారంలో విస్తారంగా పడ్డాయి. దీంతో వర్షపాతం లోటు భర్తీ అయింది. అయితే ఇప్పుడు నైరుతి రుతుపవనాలు వెళ్తూ వెళ్తూ అల్పపీడనాలకు అవకాశం కలిగిస్తున్నాయి. ఇప్పుడు సైతం విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.