https://oktelugu.com/

Daggubati Purandeswari : ఆంధ్రాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మార్పుని ఎలా చూడాలి?

తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తిగా ఉన్న కమ్మ నాయకులను ఆమె బీజేపీ గూటికి తెచ్చే అవకాశముంది. రాజకీయాలపై మక్కువ ఉండి అవకాశం లేని కమ్మ తటస్థ నాయకులను సైతం ఆకర్షించే చరిష్మ పురంధేశ్వరి సొంతం.కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో పనిచేసిన అనుభవం ఉంది.

Written By: , Updated On : July 5, 2023 / 06:49 PM IST
Follow us on

Daggubati Purandeswari : సాధారణంగా రాజకీయ పార్టీలు ప్రయోగాలు చేస్తాయి. ఒక్కోసారి సక్సెస్ అవుతాయి. లేకుంటే అట్టర్ ప్లాఫ్ అవుతాయి. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న కాషాయదళం సర్వశక్తులను ఒడ్డుతోంది. అందులో భాగంగానే నాలుగు రాష్ట్రాల సారధులను మార్చింది. మరో ఆరు రాష్ట్రాల్లో నాయకత్వాలను మార్చనున్నట్టు తెలుస్తోంది. అయితే జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం కూడా ముగిసింది. కానీ ఆయన్ను మార్చలేదు. ఆయనతో నియమితులైన సోము వీర్రాజు, బండి సంజయ్ లను మార్చారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పైగా గతానికి భిన్నంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. త్రిపురలో ఇలానే ప్రయోగం చేశారు. అక్కడ వర్కవుట్ అయ్యేసరికి.. అదే ఫార్ములాను మిగతా చోట్ల విస్తరిస్తున్నారు. అయితే అది ఎంతవరకూ లాభిస్తుందో చూడాలి మరీ.

త్రిపురలో ఇదే తరహాలో బీజేపీ హైకమాండ్ ఆలోచన చేసింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతకు బీజేపీ పగ్గాలు అప్పగించింది. అక్కడ కాంగ్రెస్ నుంచి చేరికలకు అది ఎంతగానో దోహదపడింది. సామాజికవర్గ సమీకరణలు సైతం మారాయి. బీజేపీ ఫార్ములా వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ఏపీలో కూడా పురంధేశ్వరిని అడ్డం పెట్టుకొని త్రిపుర తరహాలో ఒక ఫార్ములా అమలుచేస్తున్నట్టు ఉంది. ఆమె ఎన్టీఆర్ కుమార్తె. పైగా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన మహిళా నాయకురాలు. ఇవన్నీ పార్టీకి లాభిస్తాయని హైకమాండ్ ఒక ఆలోచనతో ఉంది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తిగా ఉన్న కమ్మ నాయకులను ఆమె బీజేపీ గూటికి తెచ్చే అవకాశముంది. రాజకీయాలపై మక్కువ ఉండి అవకాశం లేని కమ్మ తటస్థ నాయకులను సైతం ఆకర్షించే చరిష్మ పురంధేశ్వరి సొంతం.కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ, వైసీపీలో అవకాశాలు లేని చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. అటువంటి వారు పురంధేశ్వరి చొరవతో బీజేపీలోకి వచ్చేందుకు సుముఖత చూపుతారు.

తెలుగుదేశం నాయకత్వాన్ని కట్టడి చేసేందుకు కూడా పురంధేశ్వరి నియామకం దోహదపడుతుంది. మొన్నటివరకూ చంద్రబాబు నాయకత్వాన్ని పురంధేశ్వరి వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ ఇటీవల చంద్రబాబు కుటుంబంతో దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేస్తారని ప్రచారం సాగింది. వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం ఏకంగా రాష్ట్ర పగ్గాలనే అప్పగించింది. పొత్తు ఉన్నా, లేకపోయినా టీడీపీకి ధీటైన నాయకత్వాన్ని తయారుచేయాలన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ హైకమాండ్ ఒక వ్యూహం ప్రకారం నడుచుకున్నట్టు పురంధేశ్వరి నియామకంతో తేటతెల్లమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మార్పుని ఎలా చూడాలన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

ఆంధ్రాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మార్పుని ఎలా చూడాలి? || Daggubati Purandeswari || BJP || Ram Talk