Pawan Kalyan: సినిమా హీరోలకు, క్రీడాకారులకు, ఇతర సెలబ్రిటీలకు ఈ సమాజం చాలా ఇచ్చింది. పేరు, హోదా, గౌరవం, డబ్బు.. ఇలా అన్నింటిని బంగారు పళ్లెంలో పెట్టి సమర్పించింది. అందుకే అలాంటి వ్యక్తులకు సమాజం మీద ఖచ్చితంగా బాధ్యత ఉండాలి. సమాజం విపత్తు వల్ల ప్రభావితమైనప్పుడు కచ్చితంగా వారు చొరవ తీసుకోవాలి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అక్కడ నటీనటులు కలిసికట్టుగా ముందుకు సాగుతారు. అక్కడిదాకా ఎందుకు మనకు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలోనూ అదే జరుగుతుంది.. కానీ అదే తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికీ నటీనటుల స్పందన అంతంతమాత్రంగానే ఉంటుంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు విపరీతమైన వర్షాలతో ఇబ్బంది పడుతున్నాయి. నష్టం కూడా తీవ్రంగా ఉంది. తెలంగాణలో చాలావరకు జిల్లాలో వర్షాల వల్ల ప్రభావితమయ్యాయి. ఏపీలోనూ అదే స్థాయిలో నష్టం ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ఎంత చేసినా.. అందరికీ సాయం దక్కదు. ఇలాంటి సమయంలోనే సెలబ్రిటీలు, సినిమా నటులు స్పందించాలి. తన వంతు బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత సహాయం చేయాలి. అయితే ఈ జాబితాకు జూనియర్ ఎన్టీఆర్ శ్రీకారం చుట్టగా.. మిగతా నటి నటులు తమ వంతు సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. అయితే ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిలిచాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతు సహాయాన్ని అందించి ఆకట్టుకున్నాడు. తాను కల్ట్ హీరోని మాత్రమే కాదని.. అంతకంటే గొప్ప మనసు ఉన్నవాడినని నిరూపించుకున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాలకు..
తెలుగు రాష్ట్రాలు తీవ్రమైన వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణకు కోటి రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏపీలో ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు ఇస్తామని అన్నారు. ఏపీలో తాను స్వయంగా పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖకు కూడా ఇతోధికంగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఏపీలోని 400 గ్రామపంచాయతీలకు.. ఒక్కో గ్రామపంచాయతీకి లక్ష చొప్పున నాలుగు కోట్లు ఇస్తామని ప్రకటించారు. మొత్తంగా 6 కోట్లు విరాళంగా పవన్ కళ్యాణ్ ఇస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్ లు పూర్తి కాలేదు. ఇవి ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో ఆయన ఈ స్థాయిలో విరాళం ప్రకటించడం పట్ల సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలు పూర్తి కాకపోయినప్పటికీ
“ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాయి. పవన్ కళ్యాణ్ చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు. సినిమాల షూటింగ్ లు పూర్తయితేనే నిర్మాతలు చేతిలో డబ్బులు పెడతారు. అలాంటప్పుడు ఆయన చేతిలో ఉన్న మూడు సినిమాలు ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. అలాంటప్పుడు నిర్మాతలు కూడా పూర్తిస్థాయిలో నగదు ఇచ్చే అవకాశం లేదు. పైగా ఇప్పట్లో ఆ సినిమాల షూటింగులు పూర్తవుతాయని నమ్మకం లేదు. అలాంటప్పుడు నిర్మాతలు పూర్తిస్థాయిలో నగదు ఇవ్వడం కుదరదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పెద్దమనసు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాల వల్ల పడుతున్న ఇబ్బందులు చూడలేక తన ఉదారతను ప్రదర్శించారు. ఏకంగా ఆరు కోట్లు విరాళంగా ప్రకటించారంటే మామూలు విషయం కాదు. ఈ సమాజం ద్వారా విపరీతంగా సంపాదించిన వాళ్లు కూడా ఇలాంటి సమయంలో సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ తనకు ఎన్ని ప్రతి బంధకాలు ఉన్నప్పటికీ సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇది ఆయన గొప్ప మనసును వెల్లడిస్తోందని” సినీ ఇండస్ట్రీకి చెందినవారు వ్యాఖ్యానిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More