Pawankalyan – Varahi Yatra : పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వారాహి యాత్ర చేపడుతున్నారు. యాత్రకు రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. స్వల్ప అస్వస్థత కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. శుక్రవారం నుంచి వారాహి యాత్ర తిరిగి ప్రారంభంకానుంది. అయితే వారాహి యాత్ర తొలి విడత తరువాత తిరిగి సినిమా సెట్స్ కు ఆయన చేరుకుంటారు. అయితే యాత్ర ప్రారంభంలో పవన్ సినిమా నిర్మాతలు ఏపీకి క్యూకట్టారు. పవన్ కు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అవసరమనుకుంటే పవన్ కోసం ఏపీలో షూటింగులు మొదలుపెడతామని చెప్పుకొచ్చారు. అయితే అటువంటి హడావుడి ఏదీ కనిపించడం లేదు. యాత్ర షెడ్యూల్ పూర్తయిన తరువాత పవన్ యథావిధిగా సినిమా సెట్ లోకి అడుగుపెట్టే చాన్స్ ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం పవన్ చేతిలో మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నారు. ఇందులో ఓజి ఒక్కటే 50 శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. మిగతా వాటి వివరాలేవీ బయటకు తెలియవు. అయితే ఈ మూడు సినిమాలను పూర్తిచేసి ఎన్నికల వరకూ రాజకీయాలపై పవన్ కాన్సంట్రేట్ చేస్తారని టాక్ నడిచింది. మూడు కూడా క్రేజీ ప్రాజెక్టులే కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. తప్పకుండా హిట్ చిత్రాలుగా నిలుస్తాయని అభిమానులు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
ఈ నెల 14న అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వారాహి యాత్ర ప్రారంభమైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. నియోజకవర్గానికి రెండురోజుల చొప్పున యాత్ర షెడ్యూల్ ను కేటాయించారు. ఖాళీ సమయాల్లో సైతం సమీక్షలు, సమావేశాల పేరిట పవన్ బిజీగా ఉంటున్నారు. దీంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. యాత్రకు విరామం ఇచ్చారు. రేపటి నుంచి తిరిగి యాత్రను కొనసాగించనున్నారు. భీమవరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
కాగా తిరిగి సినిమా షూటింగులు ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఎటువంటి అప్ డేట్ వెలువడ లేదు. రాజకీయ పర్యటనలు ఎప్పుడు ఆపుతారు, తిరిగి ఎప్పుడు సెట్స్ పైకి వస్తారు, వస్తే ఏ సినిమాకు ముందుగా కాల్షీట్లు ఇస్తారనే అంశాల ఆధారంగా ఈ సినిమాల నుంచి ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. అటు చిత్ర యూనిట్లు సైతం ప్రస్తుతానికి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.