AP BRS: రాజకీయాల్లో ఆరితేరిన చాణక్యుడిగా పేరుపొందిన చంద్రశేఖర రావు భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విస్తరించేందుకు మరింత వేగంగా పావులు కదుపుతున్నారు.. మొన్నటికి మొన్న కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన తర్వాత మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు.. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ సభను, కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న తనను కలిసిన తోట చంద్రశేఖర్ కు పలు సూచనలు చేశారు.. పనిలో పనిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి లకు చెందిన అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు.

భరోసా కల్పిస్తోంది
ఆయా పార్టీల్లో టికెట్ రానివారి జాబితాను కేసీఆర్ తెప్పించుకున్నారు.. వారితో నేరుగా పార్టీ నాయకులతో మాట్లాడిస్తున్నారు.. లోక్ సభ లేదా శాసనసభ లో కోరుకున్నచోట పోటీ చేయవచ్చని భరోసా కల్పిస్తున్నారు.. అంతేకాదు ఆర్థిక సహాయం కూడా చేస్తామని ఆఫర్ ఇస్తున్నారు.. అయితే ఇటీవల తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు పార్టీలో చేరిన సందర్భంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారు.. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎవరెవరు పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఎవరెవరు చేరబోతున్నారననే చర్చ కూడా జోరు అందుకుంది.. ఇదే క్రమంలో పలువురు పేర్లు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయి..

సరిహద్దు రాష్ట్రాల్లోనూ..
కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలోనూ పాగా వేయాలని భారత రాష్ట్ర సమితి యోచిస్తోంది.. ఇందులో భాగంగా ఆ రాష్ట్రాల్లో కీలక నాయకులతో సంప్రదింపులు జరుపుతోంది.. ఏపీలో సభ నిర్వహించిన తర్వాత ఆ రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున సభలు జరపాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. అదిలాబాద్ జిల్లా కు చెందిన భారత రాష్ట్ర సమితి నాయకులు మహారాష్ట్రలో ఒక చిన్న పార్టీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే అక్కడ తెలుగువారు, తెలంగాణ మూలాలు ఉన్న వారిలో రాజకీయ నేపథ్యం ఉన్న వారిని పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొద్ది నెలల్లోనే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కూడా భారత రాష్ట్ర సమితి బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.. తెలుగువారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.. అక్కడి తెలుగు సంఘాల వారే కాకుండా.. రాజకీయంగా ఇప్పటికే వివిధ స్థాయిలో ఉన్న తెలుగువారిని గుర్తించి భారత రాష్ట్ర సమితి తరపున బరిలో నిలపాలని చూస్తున్నట్టు సమాచారం.. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయిందని.. త్వరలో చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.