Homeఆంధ్రప్రదేశ్‌YCP: ఓటింగ్ పెరగడాన్ని వైసీపీ ఎలా సమర్థించుకుంటుంది

YCP: ఓటింగ్ పెరగడాన్ని వైసీపీ ఎలా సమర్థించుకుంటుంది

YCP: సాధారణంగా పోలింగ్ పెరిగితే అధికార పార్టీకే నష్టం. ఏపీలో 2019లో ఇది స్పష్టంగా కనిపించింది. 2014 ఎన్నికల కంటే.. 2019లో ఒక్క శాతం ఓటింగ్ అదనంగా పోలైంది. ఓడిపోయిన వారితో పాటు గెలిచిన వారి మైండ్ బ్లాక్ అయింది. 2019 కంటే ఈ ఎన్నికల్లో రెండు శాతం పోలింగ్ అదనంగా నమోదయింది.గతంలో ఎన్నడూ లేనివిధంగా అర్ధరాత్రి వరకు ఓటర్లు బారులు తీరారు. ఓపికగా ఓటు వేశారు. మొత్తం 82% ఓటింగ్ నమోదు అయ్యింది. అయితే ఇప్పుడు పెరిగిన రెండు శాతం చిన్నది కాదు. హై పోలింగ్లో ఎంత చిన్న మొత్తం పెరిగిన అది సంచలనమే.

దేశంలో ఎక్కడ పోలింగ్ అధిక శాతం జరిగినా.. అది అధికార పార్టీకే నష్టం. ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉంటే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దింపడానికి ఉత్సాహంగా ఓటు వేస్తారు. గత ఎన్నికల్లో ఒక్క శాతం ఓటింగ్ అదనంగా నమోదయ్యేసరికి వైసీపీ సైతం ఇదే ఆలోచనకు వచ్చింది. తమ గెలుపు తప్పదని అంచనా వేసింది. వాస్తవానికి ప్రభుత్వంపై పాజిటివ్ ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు ముందుకు రారు. గెలిచిన పార్టీకి ఓటు ఎందుకులే అన్న నిర్ణయానికి వస్తారు. కానీ వ్యతిరేకత ఉంటే మాత్రం ఎండను లెక్కచేయరు. ఇబ్బందులను పట్టించుకోరు. ఇప్పుడు ఏపీలో జరిగింది ఇదే.

ఏపీలో ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగే సరికి వైసిపి కొత్త విశ్లేషణను తెరపైకి తెచ్చింది. ఉదయం సమయంలో వృద్దులు, మధ్యాహ్నం కి మహిళలు, సాయంత్రం తరువాత యువత ఓటు వేశారని.. అదంతా ప్రభుత్వ అనుకూల ఓటింగ్ అని ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే గతంలో కూడా వైసిపి ఇదే మాదిరిగా ప్రకటించి మూల్యం చెల్లించుకున్న సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా వాలంటీర్లు తమ వారేనని, సచివాలయ ఉద్యోగులను నియమించింది తామేనని, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఓటు వేస్తారని భావించింది. అప్పట్లో అధికారంలో ఉండడంతో తమకు అనుకూల ఫలితం వస్తుందని భావించారు. కానీ ఏకంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలను టిడిపి కైవసం చేసుకునే సరికి అసలు తత్వం బోధపడింది.

ఈ ఎన్నికల్లో ప్రతి 100 మందిలో 82 మంది ఓటు వేశారంటే.. ఓటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం 95 శాతం నమోదు కావడం ఆషామాషీ విషయం కాదు. సాధారణంగా లక్షన్నర పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యేవి. అటువంటిది నాలుగున్నర లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎలా చూసినా ఓటర్లలో ఒక రకమైన చైతన్యం పెరిగింది. కానీ అది తమకు అనుకూలమని వైసిపి భావిస్తుండడం అతి అవుతోంది. ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయులు దూరమయ్యారు. మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారు ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు. పేద తరగతి వారు సైతం సంక్షేమ పథకాలు తీసుకుంటూనే.. పన్నులు, చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఓటింగ్ పెరగడాన్ని వైసిపి ఆహ్వానించడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version