https://oktelugu.com/

Nellore: ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆ యువతి చేసిన తప్పు.. దానికి ఆమె తల్లిదండ్రులు ఎంతటి శిక్ష విధించారంటే..

చెప్పిన మాట వినలేదని.. ప్రేమ పేరుతో కులం కాని వారిని పెళ్లి చేస్తుందని.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కుమార్తెకు దారుణమైన శిక్ష విధించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 21, 2024 10:26 am
    Nellore

    Nellore

    Follow us on

    Nellore: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభుని సత్రం పల్లి పాలెం అనే గ్రామానికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం.. ఇందులో చిన్న కుమార్తె పేరు శ్రావణి (24). ఆమెకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. భర్త వ్యవహార శైలి నచ్చక ఆమె విడాకులు తీసుకుంది. వెంకట రమణయ్య, దేవసేనమ్మ దంపతులకు గ్రామంలో కూరగాయల దుకాణం ఉంది. అప్పుడప్పుడు శ్రావణి కూరగాయలు విక్రయించడానికి అక్కడికి వెళ్ళేది. ఆ క్రమంలో పక్కనే ఉన్న నార్త్ ఆములూరు గ్రామానికి చెందిన రబ్బాని భాషా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 20 రోజుల క్రితం కసుమూరు దర్గాలో వారు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు తెలియడంతో నార్త్ ఆములూరు కు వెళ్లారు. శ్రావణి కొట్టి.. ఇంటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శ్రావణి, వెంకట రమణయ్య, దేవసేనమ్మ కు తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆవేశం తట్టుకోలేక వెంకట రమణయ్య, దేవసేనమ్మ కొట్టడంతో శ్రావణి తీవ్రంగా గాయపడి, చనిపోయింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలని భావించి దేవసేనమ్మ, వెంకట రమణయ్య శ్రావణి మృతదేహాన్ని ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గొయ్యి పూడ్చారు. ఎవరికీ అనుమానం కలకుండా ఉండేందుకు తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఇలా వెలుగులోకి వచ్చింది

    వెంకట రమణయ్య, దేవసేనమ్మ ఇంటికి సమీపంలో ఒక మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టారని పోలీసులకు ఓ వ్యక్తి గురువారం ఫోన్ చేశాడు. దీంతో ఎస్ఐ కోటిరెడ్డి, రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అనంతరం రమణయ్య, దేవసేనమను అదుపులోకి తీసుకున్నారు. వారి శైలిలో విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ సిబ్బంది సహాయంతో ఆ ప్రాంతంలో తవ్వి చూడగా శ్రావణి మృతదేహం వెలుగు చూసింది. ఆ తర్వాత శరీరం నుంచి పోలీసులు నమూనాలు సేకరించారు. ఆ తర్వాత ఆ శవాన్ని అక్కడే ఖననం చేశారు. మొదట్లో “అదృశ్యమైన యువతి” పేరుతో పోలీసులు కేసు నమోదు చేశారు.. దానిని ఇప్పుడు హత్య కేసుగా మార్చారు.. శ్రావణి తల్లిదండ్రులను విచారించిన అనంతరం పోలీసులు రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమ కూతురిని చంపేసి.. ఇంట్లో ఉన్న స్థలంలో పూడ్చేసి.. ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు ఫిర్యాదు చేయడం పట్ల పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి వారి ఇంటి పక్కన ఉంటాడని.. శ్రావణి కొడుతున్నప్పుడు అతడు చూశాడని తెలుస్తోంది.