https://oktelugu.com/

MLC Duvvada Srinivas: తెలుగు నాట దువ్వాడ కుటుంబ కథా చిత్రం దుమారం.. అర్ధరాత్రి హైడ్రామా!

తెలుగు నాట వైసీపీ ఎమ్మెల్సీ కుటుంబ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో దూకుడు కలిగిన నేతగా గుర్తింపు పొందిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కింది. ఆయన వ్యవహార శైలి పై భార్యతో పాటు కుమార్తెలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 10, 2024 / 12:19 PM IST

    MLC Duvvada Srinivas

    Follow us on

    MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గత రెండు రోజులుగా మీడియాకు ఇదే ప్రాధాన్యత అంశంగా మారిపోయింది. దువ్వాడ కుటుంబాన్ని విడిచిపెట్టి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నారన్నది ఆరోపణ. దీనిపై గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఎన్నికల ముందు ఇదే అంశం తెరపైకి రావడంతో అప్పటి సీఎం జగన్ కలుగ చేసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించి టెక్కలి అభ్యర్థిగా ఆయన భార్య వాణి పేరును ప్రకటించారు. కానీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా మళ్లీ దువ్వాడ శ్రీనివాస్ పేరును ఖరారు చేశారు. దీంతో తీవ్రంగా రగిలిపోయారు వాణి. ఒకానొక దశలో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో.. అప్పటి పెద్దలు సర్ది చెప్పడంతో మెత్తబడ్డారు. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ సైతం ఘోరంగా ఓడిపోయారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఆ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దీంతో రెండు రోజుల క్రితం తండ్రిని వెతుక్కుంటూ ఇద్దరు కుమార్తెలు వెళ్లారు. సుమారు నాలుగు గంటల పాటు తండ్రి నివాసం వద్ద వెయిట్ చేయక తప్పలేదు. కనీసం గేట్లు కూడా తెరవలేదు. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తున్నారని.. తనతో పాటు పిల్లలను అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.

    * బలవంతంగా గేట్లు తొలగించి
    అయితే ఈ ఘటనపై దువ్వాడ శ్రీనివాస్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. దువ్వాడ వాణి, తన పెద్ద కుమార్తె డాక్టర్ హైందవి తో కలిసి శుక్రవారం రాత్రి దువ్వాడ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే గేట్లుకు తాళాలు వేసి ఉండడంతో బలవంతంగా తొలగించారు. లోపలికి ప్రవేశించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. ఇంతలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరులు, అనుచరులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాణి తో పాటు ఆయన కుమార్తెను హెచ్చరించారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఎమ్మెల్సీ శ్రీనివాస్ భార్యను బూతులు తిడుతూ కొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు.

    * గట్టిగానే ‘వాణి’
    తనతో పాటు పిల్లలకు న్యాయం చేయకుంటే ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ దువ్వాడ వాణి తేల్చి చెప్పారు. ఇది టెక్కలి అని.. తన సొంత ప్రాంతమని.. ఇక్కడ గూండా గిరి చేస్తే చెల్లదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలుగజేసుకొని ఆమెను నిలువరించారు. శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లిపోయినా వాణి తో పాటు కుమార్తెలు అక్కడే ఉండిపోయారు.మరోవైపు మీడియా హడావిడి ఎక్కువగా సాగింది. అర్ధరాత్రి వరకు టెక్కలిలో హైడ్రామా నడిచింది.

    * వీధిన పడేశారు
    మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ తో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి అనే మహిళ మీడియాతో శ్రీకాకుళంలో మాట్లాడారు. దువ్వాడ శ్రీనివాస్ తో తనకు స్నేహం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. తనను వైసీపీలోకి తెచ్చింది దువ్వాడ వాణి అని.. మహిళా అధ్యక్ష పదవి కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు తన పేరును అనవసరంగా బయటకు లాగారని.. తన కుటుంబాన్ని వీధిన పడేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని దువ్వాడ శ్రీనివాస్ స్వయంగా మీడియాకు తెలియజేస్తారని కూడా ఆమె చెప్పుకు రావడం విశేషం. మొత్తానికైతే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతోంది.