High Court Warning AP Police: ఒక ప్రభుత్వానికి సంబంధించి మిగతా శాఖలు ఎలా పనిచేసినప్పటికీ.. పోలీస్ శాఖ మాత్రం నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే శాంతి భద్రతలకు భంగం ఏర్పడితే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది. పెట్టుబడులు రావు. ఉద్యోగాలు ఏర్పడవు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. అందువల్లే ప్రభుత్వాలు పోలీస్ శాఖకు అపరిమితమైన అధికారాలు ఇస్తుంటాయి. ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతుంటాయి. కానీ ఏపీలో ఇందుకు విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం చంద్రబాబు నాయుడు సొంతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పోలీస్ శాఖ మీద, శాంతిభద్రతల మీద ఆయనకు విపరీతమైన పట్టు ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అల్లర్లను ఆయన అడుగుదాక తొక్కారు. ఫ్యాక్షనిజాన్ని లేకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. నక్సలిజం సమస్యను కూడా రూపుమాపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు సాధించారు చంద్రబాబు. అయితే అటువంటి చంద్రబాబు ఇప్పుడు పోలీస్ శాఖ మీద అంతగా దృష్టి సారించడం లేదా.. అందువల్లే వరుస సమస్యలు ఎదురవుతున్నాయా.. ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానాలు వస్తున్నాయి.
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణి విషయంలో వివాదం ఏర్పడింది. ఇది హైకోర్టు దాకా వెళ్ళింది. కేసును విచారించిన హైకోర్టు ఏపీ పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ వాటిని ఏపీ పోలీసులు అమలు చేయలేదు. లోక్ అదాలత్ రాజీ రికార్డులకు సంబంధించిన విషయంలో సీజ్ అధికారాన్ని పోలీసులు ఉపయోగించాలని గడిచిన నెల 19న ఆదేశాలు ఇచ్చింది. అయితే వీటిని ఏపీ పోలీసులు అమలు చేయలేదు. అయితే సీజ్ చేసే అధికారం పోలీస్ విభాగంలో సిఐడి అధికారులకు ఉంటుంది. ఆ విభాగంలో ఐజి పోస్ట్ కొంతకాలంగా ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ వ్యవహారాలన్నిటిని హైకోర్టు రివ్యూ చేసింది. తాము చెప్పిన ఏ ఒక్క పని కూడా ఏపీ పోలీసులు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
“పనిచేయాలనే కోరిక ఉంటే కచ్చితంగా చేస్తారు. కానీ ఏపీ పోలీసులు అలా చేయకపోవడం పట్ల అసలు ఉద్దేశాలు ఏమిటో అర్థమవుతున్నాయి. అసలు పోలీస్ శాఖను మూసివేయడం బెటర్. డిజిపి, పోలీస్ శాఖలు నిద్రలో ఉన్నాయని అనిపిస్తోంది. అసలు ఈ డిపార్ట్మెంట్ ఎందుకు ఉందనేది అర్థం కావడం లేదు. కేసుల వ్యవహారంలో మేము తుది తీర్పులు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇటువంటివారు శాంతిభద్రతలను ఎలా కాపాడగలుగుతారని” హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.