AP Heavy Rains: ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. చాలా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక వచ్చింది. ఈనెల 25న తూర్పు మధ్య, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రకు ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు దేశానికి తాకాయి. ఏపీలోనూ ప్రవేశించాయి. కానీ జూన్, జూలైలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఆగస్టు, సెప్టెంబర్ లో మాత్రం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
25న అల్పపీడనం..
బంగాళాఖాతంలో( Bay of Bengal ) వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఈనెల 25న అల్పపీడనం ఏర్పడనుంది. 27న దక్షిణ ఒడిస్సా,- ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటి అవకాశం ఉంది. దీంతో కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన చెబుతోంది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమకు సైతం తేలికపాటి వర్షాలు ఉంటాయని సూచించింది. పిడుగులు కూడా పడతాయని హెచ్చరిస్తోంది.
గుంటూరులో భారీ వర్షం..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదు అయ్యాయి. గుంటూరు( Guntur ) సమీపంలో భారీ వర్షం పడటంతో నగరం జలమయంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అయితే తాజాగా అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు పడనుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని సూచిస్తున్నారు అధికారులు. భారీ వర్షాలు పడిన సమయంలో ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ఈ నెలాఖరు వరకు వరుస అల్పపీడనాలు ఏర్పడితే భారీ వర్షాలు నమోదు అవుతాయి. ముఖ్యంగా నదుల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది.