AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు భారీవర్ష సూచన ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక హెచ్చరికలు జారీచేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. గురువారం వరకు ఈ వానలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* ఆకాశం మేఘావృతం
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. చలి గాలులు వీస్తున్నాయి. బుధవారం పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో తీరంలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు బుధవారం వరకు చేపల వేటకు వెళ్ళకూడదని అధికారులు సూచిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా విపత్తులతో తీరానికి పరిమితం అయ్యారు మత్స్యకారులు. దీంతో ఉపాధికి దూరమైనట్లు వారు చెబుతున్నారు.
* చలిగాలులతో ప్రజలకు అసౌకర్యం
మరోవైపు చలిగాలుల తీవ్రత ఏపీవ్యాప్తంగా కొనసాగుతోంది. ఏజెన్సీలో అయితే పరిస్థితి మరింత దిగజారుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పట్టాయి. మన్యంలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి విపరీతమైన పొగ మంచు పడుతోంది. ఉదయం 10 గంటల వరకు విడవడం లేదు. దీంతో రహదారులపై రాకపోకలు, ప్రయాణాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. మరి కొద్ది రోజుల పాటు చలి తీవ్రత ఇలానే కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవైపు వర్షాలు, ఇంకో వైపు చలి తీవ్రతతో ఏపీ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.