Heavy rain in AP : ఏపీకి( Andhra Pradesh) భారీవర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతోంది. చెదురు మదురుగా వర్షాలు పడడంతో పాటు కొన్నిచోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఏపీలో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమ మీదుగా ఏపీలో ప్రవేశించాయి. రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు రావడంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం అయింది.
* ఆ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం..
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం( Srikakulam ), విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు వైపునకు కదిలి వాయుగుండం గా బలహీన పడింది. దాని ప్రభావం కూడా ఏపీ పై ఉంది. తాజాగా బంగాళాఖాతంలో సైతం ఓ అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది.
Also Read : ఏపీకి బిగ్ అలెర్ట్.. ఆ జిల్లాలకు వర్ష సూచన!
* ఒడిస్సా తీరానికి దగ్గర్లో..
ఒడిస్సా తీరానికి దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ మరింత బలపడుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రెండు రోజులపాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా రావివలసలో 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. విజయనగరం జిల్లా రాజాంలో 87.25 మిల్లీమీటర్ల వర్షం పడింది.
* ముందుగానే రుతుపవనాలు..
అయితే గతం కంటే ముందుగానే రుతుపవనాలు దేశంలో ప్రవేశించాయి. రాష్ట్రవ్యాప్తంగా జూన్ సెప్టెంబర్ మద్యకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కోస్తాలో 109 శాతం, రాయలసీమలో 112% వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేస్తున్నారు. జూన్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని.. రుతుపవనాలు ముందుగానే రావడంతో తొలకరి కూడా త్వరగా మొదలవుతుందని చెబుతున్నారు. మొత్తానికి అయితే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని తెలుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉత్తరాది రాష్ట్రాల్లో అప్పుడే భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ముంబైలో కుండపోత వానలు పడ్డాయి. కేరళలో సైతం భారీ వర్షాలు పడుతున్నాయి.