Rain Alert In AP: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఏపీలో ఉత్తరాంధ్రకు( North Andhra) భారీ వర్ష సూచన చేసింది. పశ్చిమ బెంగాల్ – ఒడిస్సా మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అందుకు తగ్గట్టుగానే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో సోమవారం వేకువజాము నుంచి వర్షం ప్రారంభం అయింది. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు తీరానికి పరిమితం అయ్యారు. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా జిల్లాల్లో సైతం ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
* రుతుపవనాల్లో కదలిక..
ప్రస్తుతం రుతుపవనాలు కదలిక ప్రారంభం కావడంతో అల్పపీడనాల ఏర్పాటుకు అవకాశం కలుగుతుంది. ఈరోజు ఒడిస్సా కు( Odisha ) ఆనుకొని అల్పపీడనం ఏర్పడనుండడంతో దాని ప్రభావం అప్పుడే ప్రారంభం అయ్యింది. ఒకవైపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదు అవుతుంటే.. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈరోజు, రేపు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో చెట్ల కింద, శిధిల భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరిస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాంధ్రలో వాగులు, కాలువలు పొంగి అవకాశం ఉండడంతో ముందస్తు సూచనలు చేసింది.
* ఈరోజు ఈ జిల్లాల్లో..
ఈరోజు ఉత్తరాంధ్రకు ప్రధానంగా వర్ష సూచన ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం( Srikakulam ), విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడతాయి. మంగళవారం ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. బుధవారం వినాయక చవితి వేడుకలకు వర్షం ఎఫెక్ట్ తప్పకుండా ఉండనుంది. వర్షం కారణంగా మండపాల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇంకోవైపు వర్షాలు పడుతుండడంతో ఉత్తరాంధ్రలో చాలా చోట్ల రైతులు దమ్ములు చేస్తున్నారు.