AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాయలసీమలో వర్షాలు దంచి కొడుతున్నాయి. తాజాగా ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు పడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఈ తెల్లవారుజామున 6 గంటల సమయానికి విశాఖకు 300, ఒడిస్సా లోని గోపాల్పూర్ కు 310, పారాదీప్ నకు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపు కదులుతోంది. నేటి రాత్రికి గోపాల్ పూర్- పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరాల మధ్య దాటి అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
* ఉత్తరాంధ్ర పై పెను ప్రభావం
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. మిగతా జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలు కొనసాగునున్నాయి.
* భారీ ఈదురుగాలులు
వాయుగుండం తీరం దాటే క్రమంలో భారీ ఈదురుగాలులు కొనసాగనున్నాయి. గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. శనివారం వరకు మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్లకూడదని అధికారులు సూచించారు. మరోవైపు చాలా జిల్లాల్లో పిడుగుల వాన పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేస్తోంది. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. కాగా వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో కుండపోతగా వర్షం పడుతోంది. ఈ రాత్రికి వాయుగుండం తీరం దాటనుండడంతో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది.