Health Scheme AP: ఏపీ ప్రభుత్వం( AP government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అత్యవసరమైన వైద్యం అందించేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించే ఒక పథకానికి ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశంలోనే ఇదో రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఏడాదికి ఒక్కొ కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా ఈ కొత్త విధానం పనిచేస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది. మరోవైపు ఆయుష్మాన్ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సైతం ఉచిత వైద్యానికి సంబంధించి పరిమితులు ఇచ్చింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీని అందుబాటులోకి తేనుంది. అదే జరిగితే పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
* ఆ రెండు పథకాలు అనుసంధానం..
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ( aarogya Sri ), కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాలు అమలవుతూ వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు విలువచేసే వైద్యం ఉచితం. ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండింటిని అనుసంధానం చేసి.. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ఒక్కో కుటుంబం ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఉచిత వైద్య సేవలు పొందేలా ప్రణాళిక రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా ఏ కుటుంబం ఆరోగ్య సమస్యల ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని భావిస్తోంది. అయితే ఈ పథకం అమలు అయితే మాత్రం.. దేశంలోనే ఏపీ ప్రత్యేక గుర్తింపు సాధిస్తుంది.
* అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో..
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ అమలవుతున్న ఆసుపత్రులు 2,493. ఈ నెట్వర్క్ ఆసుపత్రుల్లో( network hospitals) 3257 వ్యాధులకు చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ పాలసీ సైతం ఇదే మాదిరిగా అమలు చేయనున్నారు. 25 లక్షల రూపాయలకు లోబడి.. రాష్ట్రంలో ఉన్న పౌరులందరికీ దీనిని వర్తింపజేయనున్నారు. ఈ కొత్త హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడకుండా, ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందగలరని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సాహస నిర్ణయం ద్వారా ఏపీలో హెల్త్ కేర్ వ్యవస్థను.. ప్రపంచ స్థాయిలో చేర్చడానికి ఒక అడుగుగా భావిస్తున్నారు. గతంలో చంద్రన్న బీమా రికార్డు సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో ఈ కొత్త హెల్త్ పాలసీని అమలు చేయనున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కూడా తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి కేంద్రం అనుమతులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.