Jagan: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. ప్రణాళిక ప్రకారం నడుచుకుంటోంది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, మౌలిక వసతుల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులను ఆహ్వానించడం, ప్రపంచ దిగ్గజ సంస్థలను ఏపీకి రప్పించడం వంటివి చేస్తోంది. వాటిని సైతం ప్రచారం చేసుకుంటోంది. అవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి కూడా. అయితే ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనిని చూసి జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అవుతోంది. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పనులు.. టిడిపి ప్రభుత్వం ఫినిష్ చేసి తన ఖాతాలో వేసుకుంది. కానీ అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పనులను కొనసాగించడానికి జగన్ అంగీకరించలేదు. కానీ ఇప్పుడు టిడిపి ప్రభుత్వం చేస్తున్న పని చూసి జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయింది.
* ప్రతికూలత దాటిన చంద్రబాబు..
సాధారణంగా అధికార పార్టీకి, ప్రభుత్వానికి తప్పకుండా విమర్శలు వస్తాయి. కానీ వాటిని తిప్పి కొట్టడంలోనే చతురత చూపుతున్నారు చంద్రబాబు( CM Chandrababu). పెద్ద ఎత్తున పరిశ్రమలను తెప్పించడం ద్వారా తటస్థ ఓటర్ల పై ప్రభావం చూపుతున్నారు. విద్యాధికులను, విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదించారు. అందులో చాలా వాటిని ప్రారంభించారు. అయితే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా వాటిని అడ్డుకోలేదు. పనులు నిలుపుదల చేయలేదు. పనులు కొనసాగించి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. పనులు జరుపుతున్న తీరుపై ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ప్రజల నుంచి చంద్రబాబు సర్కార్ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది.
* సంక్షేమాన్ని నమ్ముకున్న జగన్..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఎంతవరకు సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్నారు. సంక్షేమ రాజ్యంగా మార్చాలని భావించారు. బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టలేదు. ఆపై తాను చేసుకున్నది సరైన ప్రణాళికతో ప్రజలకు వివరించనూ లేదు. ఎంతవరకు రాజకీయ ప్రత్యర్థులను పలుచన చేసేందుకే ప్రయత్నించారు. కానీ చంద్రబాబు అలా చేయడం లేదు. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే వైసిపి వైఫల్యాలను ఎండగడుతున్నారు. వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు తెలియజేప్పుతున్నారు. అదే సమయంలో పెద్ద ఎత్తున అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలను సైతం ఏపీకి రప్పిస్తున్నారు. ఆ పరిశ్రమల యాజమాన్యాలతోనే ఈ విషయంలో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. మరోవైపు కార్యాచరణ కూడా కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుకూలత రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. తమ హయాంలో అవన్నీ ప్రారంభించామని.. వాటిని తెలుగుదేశం పూర్తిచేసి తన ఖాతాల్లో వేసుకుంటూ ఉందని వైసిపి చెబుతోంది. కానీ వైసీపీ నుంచి వస్తున్న ఈ వ్యాఖ్యల పట్ల ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు.