Surya Prakash: జనసేనకు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ షాక్ ఇచ్చారు. జనసేనకు రాజీనామా ప్రకటించారు. జనసేన పిఎసి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హరి రామ జోగయ్య పవన్ కు లేఖాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సూర్య ప్రకాష్ వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడం విశేషం. అయితే ఆయన జనసేన టికెట్ ఆశించారు. దక్కకపోయేసరికి పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వైసిపి గూటికి చేరడం విశేషం. గతంలో అదే పార్టీలో తండ్రితో పని చేశారు. పార్టీ నాయకత్వాన్ని విభేదించి బయటకు వచ్చారు. జనసేనలో యాక్టివ్ గా పని చేశారు. ఇప్పుడు టిక్కెట్ దక్కకపోయేసరికి యూటర్న్ తీసుకున్నారు.
హరి రామ జోగయ్య గత కొద్దిరోజులుగా జనసేనకు పనిచేస్తున్నారు. అయితే నేరుగా పార్టీలో చేరకుండా కాపు సంక్షేమ సేవా సమితి పేరిట జనసేనకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. పొత్తులో భాగంగా దాదాపు 40 పైగా అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాలని పవన్ కు సూచించారు. అటు ముఖ్య మంత్రి పదవి విషయంలో సైతం స్పష్టమైన సూచనలు చేశారు. అయితే పవన్ దీనిపై తాడేపల్లిగూడెం సభలో స్పష్టతనిచ్చారు. తనకు ఎవరు సలహాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమి పాలైనప్పుడు మీరు ఏం చేశారని ప్రశ్నించారు. నాడు గెలిపించి ఉంటే.. పొత్తులో భాగంగా సింహభాగం సీట్లు అడిగి ఉండేవాడినని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో హరి రామ జోగయ్య కుమారుడు పార్టీకి రాజీనామా ప్రకటించడం విశేషం. నేరుగా వైసిపి కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సూర్య ప్రకాష్ ఆచంట నియోజకవర్గ జనసేన ఇన్చార్జిగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో జనసేన టికెట్ ను ఆశించారు. కానీ ఆచంట టిక్కెట్ను టిడిపికి ఖరారు చేస్తూ అభ్యర్థిని ప్రకటించారు. దీంతో నిడదవోలు నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయిస్తారని ఆశించారు. అక్కడ కూడా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో అధికార వైసీపీ వైపు మొగ్గు చూపారు. శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. పార్టీలో చేరిన తర్వాత సూర్యప్రకాష్ కు పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించే అవకాశం ఉందని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే జనసేన అధినేత పవన్ కు లేఖలతో చికాకు పెట్టిన హరి రామ జోగయ్య కుటుంబం వైసీపీ వైపు వెళ్లడం విశేషం. దిగ్గజ కాపు నేత కుమారుడు వైసీపీలోకి వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది