Harirama Jogaiah: లేఖలతో కాక మీద ఉన్న హరి రామ జోగయ్య మరో బాంబు పేల్చారు. పవన్ కు తాజాగా ఒక లేఖను రాశారు. నేను వైసిపి కోవర్టునా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని హితవు పలికారు. ఇటీవల తాడేపల్లిగూడెం సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నా పార్టీ నా ఇష్టం.. నేను ఇలాగే నడుపుతా.. నచ్చిన వాళ్ళు ఉండండి.. లేని వాళ్ళు వెళ్లిపోండి అంటూ పవన్ చేసిన కామెంట్స్ పై హరి రామ జోగయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ తాజాగా లేఖ రాశారు. అందులో సంచలన వ్యాఖ్యలు చేశారు. హరి రామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరిన కొద్ది గంటల ముందే ఈ లేఖ విడుదల కావడం విశేషం.
జనసేన బాగు కోసం.. మా కాపుల ప్రయోజనాలు కాపాడేందుకు నేను ఇస్తున్న సలహాలు మీకు నచ్చినట్లు లేవు. చంద్రబాబు సీఎం.. వేరే వాళ్లకు అవకాశం లేదు అని లోకేష్ చేసిన ప్రకటనను ఖండించినందుకు నేను వైసిపి కోవర్టునా? అంటూ నిప్పులు చెరిగారు. జనసేనకు 40 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటే 24 సీట్లు ఇచ్చారు.. ఈ ఘోరాన్ని ప్రశ్నించినందుకు నేను వైసిపి కోవర్టునా? అని నిలదీశారు. జనసేన మద్దతు లేకుండా టిడిపి గెలవడం అసాధ్యం కాబట్టి చంద్రబాబు మీతో జతకట్టాడు. ఎన్నికలయ్యాక చంద్రబాబు మీకు ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం లేదు. కూటమి గెలిస్తే చంద్రబాబు జనసేన ను నిర్వీర్యం చేస్తాడు. లోకేష్ ను సీఎం చేస్తాడు. ఆ భయం జనసైనికుల్లో ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ కు గౌరవం దక్కాలని నేను డిమాండ్ చేయడం నేరమా? అంటూ జోగయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.
నీకు ఇష్టం లేకున్నా నేను మాత్రం మిమ్మల్ని వదలనని… కాపాడుకోవడం నా ప్రధాన విధి అని.. నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలానే ఉంటుందని హరి రామ జోగయ్య వ్యాఖ్యానించడం విశేషం. ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు, లోకేష్ లు మిమ్మల్ని వాడుకుంటున్నారని కూడా గుర్తు చేశారు. చంద్రబాబుకు మీరంత అండగా నిలుస్తున్నారని.. కానీ మిమ్మల్ని ప్యాకేజీ స్టార్ అంటూ వెక్కిరిస్తుంటే ఆ ప్రచారాన్ని చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ముమ్మాటికి మిమ్మల్ని వాడుకోవడానికి టిడిపి ప్రయత్నిస్తోందని.. ఆ కుట్రను మీరు గుర్తించడం లేదని జోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
నేను ఎవరి సలహాలు సూచనలు పాటించనని పవన్ ఇప్పటికే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆచంట నియోజకవర్గ టిక్కెట్ హరి రామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఆశించారు. ఆ స్థానాన్ని టిడిపికి కేటాయించారు. ఇది హరి రామ జోగయ్యకు మింగుడు పడని విషయం. జనసేన కోసం ఇంతలా ప్రయత్నం చేస్తుంటే తన కుటుంబాన్ని ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని జోగయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం కుమారుడి టికెట్ కోసమే ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని.. కూటమిలో చిచ్చు పెట్టేందుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారని టిడిపి, జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే తాజా లేఖలో హరి రామ జోగయ్య తన ఆవేదనను వ్యక్తం చేయడం విశేషం. ప్రస్తుతం ఈ అంశాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.