Harirama Jogaiah: కాపుల రిజర్వేషన్ల అంశం దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదో పెండింగ్ అంశంగా మారిపోయింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం పతాక స్థాయికి చేరినా ఫలితం ఇవ్వలేదు. అయితే ఈ ఉద్యమం ఒక పార్టీకి రాజకీయ ప్రయోజనం, ఇంకో పార్టీకి నష్టం చేకూర్చడం మాత్రం ఆనవాయితీగా వస్తోంది. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నది దశాబ్దాల కల. ఈ డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఆవిర్భవించిన జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో జాప్యం చేశారు. దీంతో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అందుకున్నారు ముద్రగడ పద్మనాభం. ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఉద్యమం విధ్వంసానికి దారితీసింది. ఈ క్రమంలో కేంద్రం ప్రకటించిన ఈబీసీ రిజర్వేషన్లు 10 శాతం లో.. ఐదు శాతాన్ని కాపులకు కేటాయించారు చంద్రబాబు. కాపులకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు విదేశీ దీవెన పథకాన్ని సైతం ప్రారంభించారు. అయితే కాపుల్లో చంద్రబాబుపై ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. అదే సమయంలో విపక్ష వైసిపి పై సానుకూలత ఏర్పడింది. పవన్ రూపంలో జనసేన ఉన్న కాపులు మాత్రం వైసీపీని ఆదరించారు. అయితే అధికారంలోకి వచ్చిన జగన్ కాపులకు రిజర్వేషన్ల అంశం తన పరిధిలో లేదని చెబుతూ.. చంద్రబాబు ఇచ్చిన ఈ బీసీ రిజర్వేషన్లలో ఐదు శాతాన్ని కూడా రద్దు చేశారు. దీంతో మోసపోయామని భావించిన కాపులు యూటర్న్ తీసుకున్నారు. పవన్ నేతృత్వంలోని కూటమికి నమ్మి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో కూటమి అద్భుత విజయానికి కారణమయ్యారు.
* ఇదే తొలి లేఖ
ఈ ఎన్నికల్లో కూటమి తరుపున ఎటువంటి హామీ ఇవ్వలేదు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కురువృద్ధుడు హరి రామ జోగయ్య మళ్లీ రచ్చ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. కాపుల సంగతేంటో తేల్చండి అంటూ అల్టిమేటం జారీ చేశారు. అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతున్నా.. కాపుల రిజర్వేషన్ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్నించారు. కాపుల ఉద్యమాలను గత రెండు ప్రభుత్వాలు అణిచివేశాయని.. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నందున న్యాయం చేయాలని జోగయ్య డిమాండ్ చేశారు.
* ఎన్నికల ముందు పవన్ కు
ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేశారు హరి రామ జోగయ్య. నిత్యం లేఖలు రాస్తూ చికాకు పెట్టారు. పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు తీసుకోవాలని.. కాపులకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని.. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ తీసుకోవాలని.. ఇలా రకరకాల కండిషన్లు పెడుతూ పవన్ కళ్యాణ్ కు లేఖలు రాశారు. అయితే పొత్తు విఘాతం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని… 2019లో తాను గుర్తుకు రాలేదా? అంటూ పవన్ నిలదీశారు. అటువంటి వారి సలహాలు అక్కర్లేదని తేల్చేశారు. తనను నమ్మిన వారే తనకు ఓటు వేయాలని.. కూటమికి మద్దతు తెలపాలని కోరారు. అయితే పవన్ వ్యాఖ్యల తర్వాత హరి రామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరిపోవడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
* దీని వెనుక వైసిపి?
అయితే ఇప్పుడు హరి రామ జోగయ్య లేఖ వెనుక పొలిటికల్ స్టంట్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 80 సంవత్సరాల వయసు దాటిన హరి రామ జోగయ్య మంచానికి పరిమితమయ్యారు. అప్పట్లో ఆయన పేరిట పవన్ కు రాసిన లేఖలపై అనుమానాలు వచ్చాయి. వాటి వెనుక వైసీపీ స్కెచ్ ఉన్నట్లు టాక్ నడిచింది. ఇప్పుడు కూడా ఆ లేఖలు హరి రామ జోగయ్య రాసినవి కావని.. పవన్ ను ఇరుకున పెట్టేందుకు వైసిపి అస్త్రాలుగా జనసైనికులు అనుమానిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి చేస్తున్న ఎత్తుగడగా భావిస్తున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More