Gudivada Amarnath: వైసిపి వాయిస్ వినిపించే నేతల్లో గుడివాడ అమర్నాథ్ ఒకరు. ఆ పార్టీకి ఓటమి ఎదురైన క్రమంలో చాలామంది నేతలు పార్టీ మారుతున్నారు. కానీ గుడివాడ అమర్నాథ్ విషయంలో అటువంటి పరిస్థితి ఉండదు. ఆయన వైసీపీలోనే కొనసాగుతారు. టిడిపి తో పాటు జనసేనలో ఆయన చాన్స్ లేదు. కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన గుడివాడ అమర్నాథ్ చాలా రోజులపాటు టిడిపిలో కొనసాగారు. అక్కడ నుంచి వైసీపీలోకి వచ్చారు. తిరిగి తెలుగుదేశం పార్టీ తీసుకునే ఛాన్స్ లేదు. అటు జనసేన సైతం పెద్దగా ఆసక్తి చూపదు. ఈ తరుణంలో గుడివాడ అమర్నాథ్ కు ఒక నియోజకవర్గం అవసరం. అందుకే ఆయన భీమిలిపై దృష్టి పెట్టినట్లు సమాచారం. భీమిలి ఇన్చార్జిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో అక్కడ వైసీపీకి నాయకత్వం అవసరం. ఆ బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు గుడివాడ అమర్నాథ్.
* కాపు సామాజిక వర్గం అధికం
భీమిలి లో బలమైన కాపు సామాజిక వర్గం అధికం. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అక్కడ ఎక్కువగా పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు అవంతి శ్రీనివాసరావు. 2014లో గంటా శ్రీనివాస్ రావు పోటీ చేసి గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అవంతి శ్రీనివాసరావు. ఈ ఎన్నికల్లో మరోసారి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేతలంతా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. భీమిలిపై గుడివాడ అమర్నాథ్ కర్చీఫ్ వేయడానికి ఇదే ప్రధాన కారణం.
* భీమిలి అయితే అనుకూలం
గుడివాడ అమర్నాథ్ తండ్రి గురునాధరావు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం పూర్తిగా విడిపోయింది.కొంత భాగం గాజువాకలో చేరింది. మరి కొంత భాగం భీమిలిలో చేరింది. అయితే గాజువాకలో తిప్పల నాగిరెడ్డి కుటుంబానికి పట్టు ఉంది. ఈ ఎన్నికల్లో చివరి నిమిషంలో పోటీ చేసిన అమర్నాథ్ భారీ ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. అందుకే గాజువాక సేఫ్ కాదని భావిస్తున్నారు. భీమిలి వైపు మొగ్గు చూపుతున్నారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అమర్నాథ్. ఓటమి ఎదురయింది. 2019లో అదే అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో జగన్ అక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. గాజువాక లో పోటీ చేసినా ఓటమి తప్పలేదు. భీమిలి అయితేనే బాగుంటుందని నిర్ణయానికి గుడివాడ అమర్నాథ్ వచ్చారు. మరి హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.