Earth Rotation : భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. అందువల్లనే మనకు పగలు రాత్రి వస్తున్నాయి. అంటే భూమి తిరిగేటప్పుడు సూర్యుడి వైపు ఉండే ప్రదేశం రాగానే పగలు అవుతుంది అలాగే సూర్యుడి వైపు నుండి వెనుకకు వెళ్లిపోతే రాత్రి అవుతుంది. ఈ పగలు రాత్రి ఉండబట్టే కదా మనకి రోజులు ఏర్పడుతున్నాయి. నిజానికి అన్ని పగల్లు, రాత్రులు ఒకటే కాకపోతే మనం సమయాన్ని లెక్కించడం కోసం ఒక పగలు + రాత్రి అంటే భూమి తన చుట్టూ తాను చేసిన ఒక ప్రదక్షిణని ఒక రోజు అంటున్నాం. ఆ రోజులు ఏడు కలిపి ఒక వారం, ఆ వారాలు నాలుగు ఒక నెల, ఆ నెలలు పన్నెండు కలిపి ఒక సంవత్సరం అంటున్నాం.
భూమి తన చుట్టూ తాను తిరగడం ఒక్కసారిగా ఆగిపోతే ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా.. ముందు రోజులు పోతాయి. భూమి ఆగిపోయిన తరవాత సూర్యుడి వైపు ఉన్న భాగం పూర్తిగా పగలు ఉంటుంది. వెనుక భాగం పూర్తిగా రాత్రే ఉంటుంది. దీని వలన పూర్తిగా జీవరాశులు అన్నీ నాశనం అయిపోతాయి. ఎలా అంటే. ఇప్పుడు మనకి రోజులో 12 గంటలు పగలు ఉంటేనే వేసవి కాలంలో ఇళ్లు, రోడ్లు, గాలి, నీళ్ళు అన్నీ వేడెక్కిపోతున్నాయి. చల్లదనం కోసం AC లు, కూలర్లు, ఫ్యాన్లు వాడుతున్నాం. మరి అలాంటప్పుడు ఇక చల్లబడే అవకాశమే లేకుండా ఎప్పుడూ సూర్యుని వేడి నిరంతరం ఉంటే ఏమౌతుంది? భూమి భగ్గుమంటుంది. జీవులు అన్నీ ఆ వేడి భరించలేక శలభాల్లా మాడిపోతాయి. చెట్లు, పుట్టలు చివరికి సముద్రాలు కూడా ఆవిరి అయిపోతాయి. ఋతుపవనాలు అన్ని పోతాయి. చాలా దారుణ పరిణామాలు ఏర్పడతాయి.
ఇక భూమికి అవతలి వైపు ఉండే వాళ్ల పరిస్థితి కూడా ఇంతే. అక్కడ సూర్యుడి వెలుతురు ఉండదు కాబట్టి ఫోటో సింథసిస్ జరగదు కాబట్టి చెట్లు, పంటలు పండవు. ఆహారం దొరకదు. అక్కడ అసలు వేడి ఉండదు కాబట్టి చలి పెరిగిపోయి జీవులు బ్రతకలేవు. కటిక చీకటి మాత్రమే ఉంటుంది. సూర్యుడు ఉంటేనే మనకి ఇంధనం. ఎన్ని సంవత్సరాలు దీపాలు, మంటలు పెట్టుకుని ఉంటారు? చెట్లు పెరగవు కాబట్టి వనరులు అన్నీ మహా అయితే కొన్ని సంవత్సరాలలో అయిపోతాయి. ఆ తరవాత? అది కూడా బ్రతికి ఉంటే ఇంక వేరే దారిలేక నశించిపోవడమే.
కాబట్టి ఒక్క మాటలో చెప్పాలి అంటే మిగిలిన గ్రహాల లాగే భూమి కూడా జీవం లేని గ్రహం అయిపోతుంది. ఒకేఒక్క ఆశ ఏమిటీ అంటే భూమి తిరగడం ఆగిపోయాక అటు చీకటి, ఇటు పగలు కానీ సాయంకాల ప్రదేశాలలో అంటే సూర్య కిరణాలు తీక్షణంగా పడని ప్రాంతాలు భూమి మీద ఉంటే అక్కడ గనక నీరు, గాలి అన్నీ ప్రాణి మనుగడకు ఇప్పుడు ఉన్నట్టుగా కుదిరితే ఆ ప్రాంతాలలో మనుషులు బ్రతికి బట్టకట్టవచ్చు. అది కూడా రేడియేషన్ లేకుండా, ఋతుపవనాలు వంటివి అన్నీ సక్రమంగా ఉంటే. లేకపోతే ఆ ఆశా కూడా లేదు.
ఇప్పుడు అర్థం అయ్యింది కదా అండి. మనిషికి అన్ని ఋతువులు, వేడిని, చైతన్యాన్ని ఇవ్వడానికి జీవులకు శక్తిని ఇవ్వడానికి పగలు, అలాగే ఆ వేడిని చల్లబరిచే రాత్రి వంటివి అన్నీ అవసరం. అందుకనే ఎంత వేసవిలో అయినా ఆరుబయట, లేదా డాబా మీద పడుకున్నాక తెల్లవారుఝామున పక్కలు అన్నీ చల్లగా తడిసిపోయినట్టు అయిపోతాయి. చల్లగా హాయిగా ఉంటుంది. చలి కాలంలో అయితే కాసేపు ఎండలో కూర్చోగానే వేడిగా ఉంటుంది, నీడలో కూర్చుంటే చలిగా అనిపిస్తుంది. కానీ రెండు హాయిగా ఉంటాయి.