Pithapuram Varma : పిఠాపురం.. ఎన్నికల్లో అత్యంత ప్రభావశాలిగా నిలిచిన నియోజకవర్గం. 175 నియోజకవర్గాల్లో అదొకటి అయినా.. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలవడంతో మార్మోగిపోయింది. కుప్పం, పులివెందుల సరసన చేరిపోయింది. ఇక అక్కడి నుంచి పవన్ ప్రస్థానం ప్రారంభం అయింది. ఆయనకు ఒక స్థిర నియోజకవర్గంగా మారింది. అయితే అది ఒక నాయకుడు త్యాగ ఫలితంగా సాధ్యమైంది. ఆయనే మాజీ ఎమ్మెల్యే వర్మ. 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం టిడిపి గెలిచే తొలి పది స్థానాల్లో ఒకటి. కానీ పవన్ కోరేసరికి ఆ నియోజకవర్గాన్ని త్యాగం చేశారు వర్మ. కానీ వర్మ త్యాగానికి తగ్గ ఫలితం దొరకలేదు. సరైన గౌరవం లభించడం లేదు. దీంతో వర్మ అసంతృప్తితో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో టిడిపికి జరుగుతున్న నష్టాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు. తన మనసులో ఉన్న బాధనంతా చెప్పారు.తన పదవి విషయంలో సైతం ఏదో ఒకటి తేల్చాలని విజ్ఞప్తి చేశారు.
* పవన్ కు స్థిర నియోజకవర్గంగా..
పవన్ పిఠాపురం నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మలుచుకోవాలని భావిస్తున్నారు. అందుకే అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అటు జనసేన క్యాడర్ సైతం ఈ నియోజకవర్గ తమది అన్నట్టుగా ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి స్పేస్ ఇవ్వడం లేదు. మొన్న జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీకి కనీసం సంప్రదించలేదు. ఎవరికివారుగా పోటీ చేశారు. వర్మ అనుచరులు ఓడిపోయారు. దీంతో మరింత కాక రేగింది.
* ఆయనకు ఏ పదవి దక్కలే
కూటమి ప్రభుత్వం మరో దశాబ్ద కాలం కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గంలో తన కోసం సీటు త్యాగం చేసిన వర్మ విషయంలో పవన్ పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ అయ్యే తొలి ఎమ్మెల్సీ వర్మ ది అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఆయనకు పదవి దక్కలేదు. దీంతో ఆయనలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. అటు నియోజకవర్గంలో సైతం జనసేన, టిడిపి మధ్య గ్యాప్ పెరుగుతోంది. దీనిని నియంత్రించాల్సిన అవసరం పవన్ పై ఉంది. వర్మ ఫిర్యాదుతో మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. పవన్ తో కలిసి వర్మకు ఏం న్యాయం చేస్తారో చూడాలి.