https://oktelugu.com/

AP New Pensions: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. ఈ సర్టిఫికెట్లు ఉంచుకోవాల్సిందే

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వంలో అనర్హులకు సైతం పింఛన్లు అందించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : November 18, 2024 / 05:42 PM IST

    AP New Pensions

    Follow us on

    AP New Pensions: కూటమి ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టింది. అభివృద్ధితో పాటు సంక్షేమం అవసరమేనని భావిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చూస్తోంది. అందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ముహూర్తం సైతం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడంతోపాటు జారీ ప్రక్రియను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తోంది. ఆన్లైన్ విధానం తో పాటు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఎంపిక సైతం గ్రామ సభల ద్వారా నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కొత్త దరఖాస్తుదారులకు అర్హతలతో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్ల పై స్పష్టత ఇచ్చింది. గత ఏడాదికాలంగా కొత్త పెన్షన్లు ఏపీలో మంజూరు కాలేదు. వైసిపి ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది.

    * రెండు లక్షలకు పైగా దరఖాస్తులు
    రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వంలో అనర్హులకు సైతం పింఛన్లు అందించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వీరందరికీ పింఛన్లు నిలిచిపోతాయని ప్రచారం జరిగింది. కొత్తగా పెన్షన్లు పంపిణీకి సంబంధించి ప్రక్రియ జరగనుండడంతో.. బోగస్ పింఛన్ల ఏరివేత కూడా ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే అధికారులు, సిబ్బంది గ్రామాల్లో ఆరా తీస్తున్నారు. కొత్త పింఛన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో బినామీలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

    * జనవరిలో పంపిణీ
    డిసెంబర్లో కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో జన్మభూమి 2 ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయానికి పింఛన్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లతో పాటుగా డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయి ఉన్న వ్యక్తిగత ఫోన్ నెంబర్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్లకు సంబంధించి ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంకు ఖాతా తో పాటు భర్త/ భార్య భర్త సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. వీటిని స్థానిక సచివాలయ సిబ్బంది పరిశీలించి వారి అర్హతను ఖరారు చేస్తారు. వీరికి జనవరి నుంచి కొత్త పింఛన్లు అందిస్తారు.