Nellore Rottela Festival : మతసామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ.ఎంతో విశిష్టమైనది. పేరుకు ఇది ముస్లింల పండుగ అయినా.. అన్ని మతాల వారు ఇందులో పాల్గొంటారు. నెల్లూరులో ఏటా ఈ రొట్టెల పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ రొట్టెలు మార్చుకున్నా, పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ రొట్టెల పండుగకు సుదీర్ఘ చరిత్ర ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని మతాలవారు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. నేటి నుంచి నెల్లూరు రొట్టెల పండుగ ప్రారంభం నేపథ్యంలో ప్రత్యేక కథనం.
సాధారణంగా జొన్న రొట్టె,రాగి రొట్టె, సజ్జ రొట్టెలు ఉంటాయి.నెల్లూరులోని బారాషహీద్ అంటే 12 మంది యుద్ధ వీరుల దర్గా వద్ద మాత్రం పెళ్లి రొట్టె, ఉద్యోగ రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, ఇల్లు రొట్టెలు ఒకరికొకరు పంచుతూ ఉంటారు. మనకు కావాల్సిన కోరికకు సంబంధించిన రొట్టెను తీసుకోవడం వల్ల మన కోర్కెలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. ఉదాహరణకు మీకు పెళ్లి కావాలనుకుంటే పెళ్లిరోట్టిన పంచే వారి వద్దకు వెళ్లి రొట్టెను తీసుకోవాల్సి ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఈ ఆచారం కొన్ని వందల ఏళ్ళ నుంచి వస్తోంది. కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మొహరం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజు నుంచి ఐదు రోజులు పాటు ఈ రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రొట్టెల పండుగను కులమతాలకు అతీతంగా హిందువులు,ముస్లిం సోదరులు కలిసి చేసుకుంటారు. ఇందుకు సంబంధించి కథ ఒకటి ప్రచారంలో ఉంది.
క్రీస్తు శకం 1751 లో సౌదీ అరేబియాలో మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు భారత్ కు వచ్చారు. అప్పుడు కర్ణాటకలో హైదర్ అలీ పాలన ఉండేది. 12 మంది వీరులు హైదర్ అలీతో కలిసి అనేక ప్రాంతాల్లో ప్రవక్త సందేశాలను వివరిస్తూ ఉండేవారు. అదే కాలంలో తమిళనాడు వాలాజ రాజులకు, బీజాపూర్ సుల్తానులకు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో పెద్ద యుద్ధం జరిగింది. టర్కీ కమాండర్ జుల్ఫీఖార్ బేగ్ తో పాటు 12 మంది యుద్ధ వీరుల తలలు నరికి వేశారు. ఈ యుద్ధ వీరుల తలలు గండవరంలో పడిపోగా.. మొండేలు మాత్రం గుర్రాల సాయంతో నెల్లూరులోని స్వర్ణ చెరువు వద్దకు చేరాయి. అప్పటి నెల్లూరు ఖాజీకి 12 మంది వీరులు కలలో కనిపించి మాకు స్వర్ణాల చెరువు సమీపంలో సమాధులు కట్టించమని చెప్పారు. వారి సూచనలను అనుసరించి వారికి వేరువేరుగా 12 సమాధులు నిర్మించారు. అప్పటినుంచి బారా షాహిద్ దర్గా, దాని చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని దర్గామిట్టగా పిలుస్తారు. ఇక్కడకు వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం ఏర్పడింది.
రొట్టెల పండుగకు మరో ప్రాశస్త్యం ఉంది. ఆర్కాట్ నవాబుల కాలంలో నెల్లూరు స్వరాల చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు. ఓ రోజు పని ఆలస్యం కావడంతో రజక దంపతులు అక్కడే నిద్రపోయారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారా షాహీద్ లు కలలోకి వచ్చి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని.. సమాధుల పక్కనున్న మట్టిని తీసుకెళ్లి ఆమె నుదుటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారు. ఉదయాన్నే ఆ దంపతులు గ్రామంలో వెళుతుండగా అక్కడ ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతోందని.. ఆమెకు సరైన వైద్యం చేసిన వారికి విలువైన బహుమతిని అందజేస్తామని దండోరా వేస్తుంటారు. దీంతో రజక దంపతులు తమకు కలలో వచ్చిన విషయాన్ని నవాబు రాజుకు వివరిస్తారు.దీంతో రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడ మట్టిని తెప్పించుకొని రాజు భార్య నుదుటిపై పూస్తారు. వెంటనే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది. దీంతో ఆ రాజు భార్యతో కలిసి నెల్లూరు స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి మసీదులకు ప్రార్థనలు చేస్తారు. తమ వెంట తెచ్చుకున్న రొట్టెలను అక్కడ ఉన్నవారికి పంచుతారు. అప్పటినుంచి ఈ రొట్టెల పండుగ ప్రారంభమైనట్లు చెబుతారు. ఏటా దాదాపు పది లక్షల మంది ఈ రొట్టెల పండుగకు హాజరవుతారు.
ఇక్కడ ఒక్కో రొట్టె ఒక్కో రకం. ఆరోగ్య రొట్టెలను గోధుమ, బియ్యం పిండితో తయారుచేస్తారు. అరకేజీకి ఐదు వచ్చేట్లు చేస్తారు. ఆకుకూర, మునగ కూర ఏదైనా తాలింపు ఉంచి అందిస్తారు. ఉద్యోగ, పెళ్లి రొట్టెలకు బెల్లం ముంచి అందించాలనేది ఒక నిబంధన. కోరిన కోరిక నెరవేరిన వారు మొత్తం ఐదు రొట్టెలను తయారు చేస్తారు. వాటిని ఒకటి ఇంట్లో ఉంచుకొని.. మిగిలిన నాలుగు ఇంటిని దర్గా వద్దకు తీసుకువస్తారు. ఏటా రొట్టెల పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఏడాది సైతం ఘనంగా నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Grandly started rotela panduga in nellore andhra pradesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com