Rushikonda buildings: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతోంది. అయితే వైసిపి హయాంలో విశాఖలో నిర్మించిన రుషికొండ భవనాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ భవనాలకు సంబంధించి ఎలా వినియోగించుకోవాలో తెలియడం లేదు. మరోవైపు ఆ భవనాల నిర్వహణ అనేది పర్యాటక శాఖకు ఇబ్బందికరంగా మారింది. విద్యుత్ చార్జీలతోపాటు అక్కడ పనిచేసే కూలీలకు 25 లక్షల రూపాయలు ప్రతి నెలకు ఖర్చు అవుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ భవనాలను పరిశీలించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై చర్చించారు. ఏకంగా క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ మంత్రుల బృందం ప్రత్యేకంగా ఒక నివేదిక ఇచ్చింది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఈ భవనాలను వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను అందుబాటులో ఉంచింది. ప్రజలు తమ అభిప్రాయాలను ఆ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు.
వైసిపి ఓడిపోవడంతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో ఈ భవనాలను నిర్మించారు. విశాఖ పాలన రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసమే వీటిని నిర్మించారన్నది అప్పట్లో వచ్చిన ఆరోపణ. అయితే మంత్రులు సైతం అందులో తప్పేంటి అని ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం మాత్రం బహిరంగ ప్రకటన చేయలేదు. అయితే రిషికొండను గుల్ల చేసి ఈ భవనాలను నిర్మించడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కానీ వాటిని ఎంత మాత్రం పట్టించుకోలేదు ప్రభుత్వం. భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయగలిగింది. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే ఆ భవనాల వినియోగంపై క్లారిటీ వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం రావడంతో ఆ భవనాల వినియోగం ఎలా చేయాలి అన్నదానిపై అనేక రకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. అందుకే 16 నెలల పాటు జాప్యం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఒక నిర్ణయానికి రావాలని కూటమి ప్రభుత్వం భావించింది.
అత్యాధునికంగా నిర్మాణాలు..
రుషికొండ భవనాలను అత్యాధునికంగా నిర్మించారు. అంతర్జాతీయ స్థాయిలో హంగులు కల్పించారు. 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.451.67 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. నాలుగు మేజర్ బ్లాకులుగా విభజించారు. జి ప్లస్ 1 స్థాయిలో ఏడు ప్యాలెస్ లను నిర్మించారు. విజయనగరం బ్లాక్ 3 యూనిట్లు, గజపతి బ్లాక్ 1 యూనిట్, కళింగ బ్లాక్ 1 యూనిట్, వెంకి బ్లాక్ 2 యూనిట్లుగా నిర్మించారు. వీటిలో విలాసవంతమైన గదులు, విందు ఇచ్చేందుకు బాంకెట్ హాల్స్, అధునాతన రెస్టారెంట్లు, స్పా, జిమ్ లు, సమావేశ మందిరాలు, స్టాఫ్ అకామిడేషన్ వసతులు కల్పించారు.
పర్యాటక ప్రతిపాదనలు..
అయితే ఈ భవనాలను ఎలా వినియోగించాలి అనే దానిపై ప్రభుత్వానికి స్పష్టత లేకుండా పోయింది. అయితే వీటిని పర్యాటకంగా వినియోగించుకోవాలన్నది ఒక ప్రతిపాదన. అందుకే విజయవాడలో ప్రత్యేకంగా పర్యాటక రంగ ప్రముఖులతో ఈనెల 17న సమావేశం నిర్ణయించనుంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు rushikonda@aptc.in అనే మెయిల్ చిరునామాకు 7 రోజుల్లో గా సలహాలతో పాటు సూచనలు పంపించే అవకాశం కల్పించింది ఏపీ పర్యాటక శాఖ. మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.