AP Government : ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేసింది ఏపీ సర్కార్. ఖరీఫ్ కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా వరి కోతలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత అనుభవాల దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది.ధాన్యం వెక్రయించిన 24 గంటల్లో నగదు జమ అయ్యేలా పటిష్ట ఏర్పాట్లు చేసింది. గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది ఖరీఫ్ నకు సంబంధించి ముందుగానే మేల్కొంది ప్రభుత్వం. గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. ధాన్యం విక్రయించే రైతులకు నెలల తరబడి డబ్బులు అందేవి కావు. ఈ తరుణంలో అనేక రకాల విమర్శలు వచ్చాయి. రైతుల్లో వైసీపీ ప్రభుత్వం పై ఒక రకమైన ఆగ్రహం వ్యక్తం అయింది. మరోసారి అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందు జాగ్రత్తలు చేపట్టింది. గత కొద్దిరోజులుగా ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 24051 మంది రైతుల నుంచి 1,81, 988 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
* రైతులకు ఇబ్బంది లేకుండా
రైతులకు సంబంధించిన నిర్ణయాల్లో కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. రైతుకు ఇబ్బంది లేకుండా చూస్తేనే ప్రభుత్వ మనుగడ సాధ్యమని భావిస్తోంది. ఇప్పటికే బడ్జెట్లో అన్నదాత సుఖీభవ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మందికి పథకాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది.ప్రతి రైతు ఖాతాలో 20వేల నగదు జమ చేసేందుకు సిద్ధపడుతోంది. ఇందుకుగాను బడ్జెట్లో 4500 కోట్ల రూపాయలను కేటాయించింది కూటమి ప్రభుత్వం. సంక్రాంతి నాటికి ఈ పథకం వర్తింపజేయాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు రైతులు తమ ధాన్యాన్ని స్వేచ్ఛగా విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది.ఇలా ధాన్యం విక్రయించిన 48 గంటల్లో నగదు జమ అయ్యేలా చర్యలు చేపట్టింది.
* వివరాలు వెల్లడించిన మంత్రి
తాజాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా వాట్స్అప్ చాట్ బోర్డు ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా ప్రత్యేక వాయిస్ సేవలు తీసుకొచ్చినట్లు చెప్పారు. గోనె సంచుల నుంచి రవాణా వరకు అన్ని విధానాలను సులభతరం చేసినట్లు పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. గత అనుభవాల దృష్ట్యా ముందే మేల్కొన్నామని వివరించారు. చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని..రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. మొత్తానికైతే వైసీపీ ని అప్రదిష్టపాలు చేసిన ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం ముందే మేల్కొనడం విశేషం.